ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.
ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
టాటా కుటుంబంలో చేరి..
సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.
We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ
— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025


