ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్‌ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.
బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్‌ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్‌ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్‌బాట్‌లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.
జెమిని 3, నానో బనానా ప్రో
ఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్‌ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం


