హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్‌టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.
ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.
పనిచేస్తుందిలా..
వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్‌నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది.


