ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. కీలకమైన రెపో రేటును పావు శాతం తగ్గించింది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేశారు. విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే కీలక వడ్డీ రేటును తగ్గంచింది. ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.5 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది.
రెపో రేటు కోత నిర్ణయాన్ని పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం మూడు రోజుల సమీక్ష ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈ రోజు ఆర్బీఐ గరవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
లిక్విడిటీని పెంచడానికి రూ .1 లక్ష కోట్ల ఓఎంఓ, 3 సంవత్సరాల డాలర్-రూపాయి కొనుగోలు-అమ్మకం మార్పిడిని ప్రకటించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత మన్నికైన లిక్విడిటీని అందించడానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉంది' అని ఆర్బీఐ గరవర్నర్ తెలిపారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్ల వద్ద ఆరోగ్యకరంగానే ఉన్నాయని వివరించారు.
ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావించారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది మరికొందరు విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే.


