జూనియర్ల నుంచి సీనియర్ల వరకు వివిధ విభాగాలవ్యాప్తంగా అనుభవాన్ని బట్టి అత్యధిక వేతనాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. రిటైల్, కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగ జీసీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ కెరియర్‌నెట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వివిధ రంగాలకు చెందిన 50,000 మంది ప్రొఫెషనల్స్ జీతభత్యాల డేటా ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో డేటా సైంటిస్టుకు రూ. 22.1 లక్షల నుంచి రూ. 46.9 లక్షల వార్షిక ప్యాకేజీ ఉంటోంది. అదే రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌లో చూస్తే వరుసగా రూ. 19.90–44.50 లక్షలు, రూ. 18.40 – 44.30 లక్షల స్థాయిలో ఉంటోంది.
ఇక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో జూనియర్ స్థాయిలోని ఫుల్ స్టాక్ డెవలపర్లకు రూ. 20.7 లక్షల స్థాయిలో, సీనియర్‌లకు రూ. 47.5 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. అటు స్క్రమ్ మాస్టర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లాంటి ఉద్యోగాలకు ప్రారంభంలో ఒక మోస్తరు వేతనాలు ఉన్నా క్రమంగా, భారీ స్థాయికి చేరుతున్నాయి.


