రెండేళ్లలో 1,000 మందికి లభించనున్న ఉద్యోగావకాశాలు
సీఎంతో భేటీలో జర్మన్ కాన్సుల్ జనరల్, ‘డోయిచ బోర్స’ బృందం వెల్లడి
హైదరాబాద్‌లో జర్మన్ శిక్షకులను నియమించాలని కోరిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: జర్మనీకి చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ డోయిచ బోర్స (Deutsche Borse)) తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. భాగ్యనగరంలో జీసీసీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జర్మన్ కాన్సుల్ జనరల్ (చెన్నై) మైఖేల్ హాస్పర్ సారథ్యంలో డోయిచ బోర్స ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమైంది.
జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు సీఎం ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకొనేందుకు వీలుగా హైదరాబాద్‌లో శిక్షకులను నియమించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడుల విషయంలో జర్మనీ భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మన్ కంపెనీల పెట్టుబడులను సీఎం ఆహ్వానించారు. టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా వృత్తివిద్య, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిత దేశాయ్, డోయిచ బోర్స సీఐవో క్రిస్టోఫ్ బోమ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎంను కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందం
సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో తమ డేటా సెంటర్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ కోసం చేపట్టనున్న చర్యలను వివరించింది. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అమెజాన్ బృందానికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్‌ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నానీ తదితరులు పాల్గొన్నారు.


