ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేశ్ గౌడ్, అభ్యర్థి నవీన్ యాదవ్, కోమటిరెడ్డి, పొంగులేటి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం.. మీ మధ్య ఒప్పందం లేకుంటే 11లోగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలి
కాళేశ్వరం, ఫార్ములా–ఈ రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని ఆ ఇంటి ఆడబిడ్డే చెబుతోంది.. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారిపోతోంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌తో అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, రహమత్‌నగర్‌లలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. ‘రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు.
వాళ్ల ఆడబిడ్డ చెబుతున్న మాటే. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామని పదేపదే చెప్పారు.
తీరా కాళేశ్వరంపై దర్యాప్తు చేయాలని కేసును మేము సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలైనా స్పందన లేదు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని దీనితోనే తేలిపోతుంది’అని ఆరోపించారు.
కారుగుర్తుకు ఓటేస్తే కమలంగా మారుతుంది
బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఆ తర్వాత కమలం గుర్తుగా రూపాంతరం చేందుతుందని, కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుపోతుందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రతి నిర్ణయానికి కేసీఆర్ వత్తాసు పలికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ‘కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి బీఆర్‌ఎస్ సహకరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కదు.
బీఆర్‌ఎస్ నేతలు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. 2007లో పీజేఆర్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంపై కేసీఆర్ అభ్యరి్థని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పీజేఆర్ సతీమణి కలిసేందుకు వెళితే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీతినా? ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందు రహమత్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మహిళా సెంటిమెంట్ మాట్లాడటమా?
బీఆర్‌ఎస్‌కు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కు లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటినుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్. ఆయన మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా? ఇలాంటి వాడు ఎవరింట్లోనైనా ఉంటే అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో సమాధానం చెప్పాలి.
రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా? ఉప ఎన్నిక తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’అని సీఎం హామీ ఇచ్చారు. సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజహరుద్దీన్, డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


