సాక్షి, తాడేపల్లి: ఏపీ రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు జాగీరు కాదని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాయలసీమకు అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే కదా అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి.. మీకు అనుకూలంగా ఉండే చోట కాదంటూ హితవు పలికారు.
మాజీ మంత్రి సాకే శైలజానాధ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని చంద్రబాబు జాగీరు కాదు. దాని గురించి మాట్లాడితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. ఏమీ చేయలేని వారే కోపపడుతుంటారు. రాయలసీమను అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాజధానిలో మా రాయలసీమ చెమట, రక్తం కూడా ఉంటుంది. అలాంటి రాజధానిని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సహించం. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే. దాదాపు వెయ్యి కోట్లు నీటిని ఎత్తిపోసేందుకే ఖర్చు చేశారు. అమరావతిలో బిల్డింగుల నిర్మాణానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతోంది.
చంద్రబాబు పుణ్యమా అని రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి. మీకు అనుకూలంగా ఉండే చోట కాదు. ఎకరా అభివృద్దికి రెండు కోట్లు చొప్పున మౌళిక సదుపాయాల ఖర్చు చేస్తారా?. మీరు తెచ్చే అప్పులకు ప్రతి ఏటా పదహారు వేల కోట్లు వడ్డీలే కట్టాలి. ఇదంతా రాష్ట్రమంతా భరించాలి. ఇది ఎవరి సొమ్ము?. నారాయణ కాలేజీల నుంచి డబ్బు తెస్తున్నారా?. రాజధాని గురించి ఎవరూ అడగటానికి వీల్లేదా?. రెండు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఖర్మ ఏంటి?. ప్రజల కోసం జగన్ మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తోంది?. రాయలసీమకు నష్టం చేయవద్దని చెబితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. చంద్రబాబు కట్టేది నీళ్లలో తేలియాడే నగరమా?. సమాధానం చెప్పలేకనే చంద్రబాబుకు కోపం వస్తోంది.
అమరావతిలో వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తారా? అది సాధ్యమయ్యే పనేనా?. ఆల్రెడీ ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టును ఏం చేస్తారు?. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్టు దాన్ని కూడా నిలిపేస్తారా?. మునిగిపోయే ప్రాంతంలో ఎవరూ ఇల్లు కూడా కట్టుకోరు. మరి రాజధానిని ఎలా కడతారు?. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మరి ఇప్పటి వరకు ఏ సెల్ఫ్ ఫైనాన్స్‌తో కడుతున్నారు?. అమరావతిలో కడుతోంది రాజధాని కాదు, లిఫ్టు ఇరిగేషన్లే. వడ్డమానులో భూ సమీకరణకు వెళ్తే రైతులు ఛీ కొట్టారు. భూములు ఇవ్వకపోతే లాగేసుకుంటామని బెదిరిస్తారా?. అందుకే రామారావు లాంటి రైతులు చనిపోతున్నారు. రాజధాని అందరిదీ, అదేమీ చంద్రబాబు జాగీరు కాదు. రాజధాని విషయంలో దేవతా వస్త్రాలు కట్టుకున్నట్లు వ్యవహరించవద్దు. అప్పులు తెస్తూ రుణ సమీకరణ అంటూ కొత్త పదాలు చెబుతున్నారు. ప్రజలు లేని రాజధానిని కడుతున్నారు. మీ రాజధాని కోసం మా చెమట, రక్తాన్ని ధారపోయవద్దు.
రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవటానికి అదేమీ మీ ఇంటి విషయం కాదు. రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల తరపున పోరాడుతాం. రానున్న రోజుల్లో రాజధాని గురించి అందరూ మాట్లాడతారు’ అని వ్యాఖ్యానించారు.


