భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా ఇస్రో ఒక ప్రతిష్ఠాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం3–ఎం5 అనే బాహుబలిగా పేరుబడ్డ రాకెట్ ద్వారా 4,400 కేజీల జీశాట్–7ఆర్ (సీఎంఎస్–03) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ముఖ్యంగా భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయోగం. ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి నవంబర్ 2న విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. షార్ నుండి ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యాల కోసం ఇస్రో 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన ‘జీశాట్ 7’ ఉపగ్రహ కాల పరిమితి ముగియడంతో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సీఎంఎస్–03ని తయారు చేసి పంపారు. మల్టీ–బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్–03 భారత ప్రధాన భూభాగంతో సహా విస్తారమైన సముద్రప్రాంతానికి సేవలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం ‘సీ’, ‘ఎక్స్‌టెన్డెడ్ సీ, ‘క్యూ’ బ్యాండ్లలో వాయిస్, డేటా, వీడియోల కోసం ట్రాన్స్‌పాండర్ సౌకర్యాలనుఅందిస్తుంది. ఈ శాటిలైట్ కీలకమైన సముద్ర ప్రాంతంలో భారత నౌకా దళ కమ్యూనికేషన్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడంలో ఎంతో సహాయ పడుతుంది.‘ఆత్మనిర్భర భారత్’కు దోహదం చేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసి ప్రయోగిస్తున్న ఇటువంటి ఉపగ్రహాలు భారత కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచిపోతాయి. ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ విజయం... విక్రమ్ సారాభాయ్ దూరదృష్టికీ, అబ్దుల్ కలాం స్ఫూర్తికీ, సతీష్ ధావన్ నిబద్ధతకూ, ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకూ ప్రతీక. ఇస్రో కేవలం రాకెట్లు ప్రయోగించడమే కాదు, భారత భవి ష్యత్తును అంతరిక్షంలో సువర్ణాక్షరాలతో లిఖిస్తోంది.
ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
– వి. సుధాకర్


