అభిప్రాయం
కరోనా కాలంలో పరిశ్రమలు, రవాణా, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలైనప్పుడు, కేవలం ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ మాత్రమే గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెట్టింది. అలాంటి చట్టాన్ని రద్దుపరచి, ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లును ఆమోదించడం ప్రజల జీవించే హక్కును కాలరాయడమే
2005 నాటి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’(ఎంజీఎన్ ఆర్‌ఈజీఏ–ఎంజీ నరేగా)ను రద్దుపరచి, ఆ స్థానంలో తెచ్చిన 2025 ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)–వీబీ జీ రామ్ జీ– బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది.
ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రెండు దశాబ్దాల క్రితం తెచ్చిన పాత చట్టం స్థానంలో సరి కొత్త ఆదర్శాలు, లక్ష్యాలతో ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.
పాతదానికంటే ఇది అత్యంత పారదర్శక మైనదనీ, గ్రామీణ పేదలకు మరిన్ని ఎక్కువ పనిదినాలు కల్పించ డమే కాకుండా తాగు, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందనీ మోదీ ప్రభుత్వం చెబుతోంది. కానీ అసలు ఈ చట్టాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది?
తిండి పెట్టిన చట్టం పోయి...
నూటికి 60% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం మనది. నూటికి 70% మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అనేక లెక్కలు చెబుతున్నాయి. మన లాంటి దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఏడాదికి 100 రోజులు హక్కుగా పని కల్పించిన చట్టం పాతది. ఈ చట్టం బాగా అమలు జరిగిన చోట పేదల కొనుగోలు శక్తి పెరిగింది, వలసలు తగ్గాయి, సంపన్నులతో పేదలు బేరమాడే శక్తి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల సన్న, చిన్నకారు రైతుల భూములు అభివృద్ధి కావడమే కాకుండా పంట కాలువలు, చెరువుల పూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్పుడు మన లాంటి దేశంలో వాటిని తట్టుకుని నిలబడటానికి గ్రామీణ ఉపాధి హామీ చట్టం తోడ్పడింది. రెండు దశాబ్దాలుగా వ్యవసాయ కూలీలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక స్వావలంబనను, భూస్వామ్య బంధనాల నుండి స్వాతంత్య్రాన్ని కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చట్టాన్ని ఎటువంటి బాధ్యతలూ లేని, పరిమిత బడ్జెట్ పథకంగా మార్చివేశారు.
రాష్ట్రాల అధికారం పోయి...
ఇప్పటివరకు పని కల్పించే బాధ్యత గ్రామసభల ద్వారా రాష్ట్రా లకు ఉండేది. అన్ని అధికారాలనూ ఇకపై కేంద్రం లాగేసుకుంటుంది. ‘ఎంజీ నరేగా’ ప్రకారం ఏ గ్రామంలోనైనా నిరుపేదలు, రైతులు, చేతి వృత్తిదారులు పని కావాలని అడిగితే 15 రోజుల లోపల వారికి పని కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది.
కానీ, కొత్త బిల్లు సెక్షన్ 5(1) ప్రకారం, ఎక్కడ పని కల్పించాలో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కల్పిస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని నోటిఫై చేయలేదో ఆ ప్రాంత ప్రజలకు హక్కు ఉండదు. అంటే సార్వజనీనంగా, సార్వకాలీనంగా ఉన్న హామీని కాలరాసి ఇతర సాధారణ పథకం లాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చేసింది.
పాత చట్టంలో డిమాండ్ చేసిన 15 రోజుల్లోపు పని కల్పించ వలసి ఉంటుంది. అలా కల్పించక పోతే నిరుద్యోగ భృతి చెల్లించాలి. కార్మికులకు ఇచ్చే వేతనాలలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వానివే. కానీ కొత్త బిల్లు సెక్షన్ 4(5) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని డిమాండును బట్టి నిధులు కాకుండా రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది.
ఉదా: కేరళ లాంటి వామపక్ష పాలన, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఈ చట్టం ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 4(6) ప్రకారం, కేటాయింపు ల్లోని మొత్తం కంటే ఎక్కువ ఖర్చుపెడితే ఆ మేరకు రాష్ట్ర ప్రభు త్వాలే భరించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిధులు ఇచ్చే పరిస్థితిని కల్పిస్తుంది. అంటే డిమాండ్‌ను బట్టి నిధులు ఇచ్చే పద్ధతికి బదులు, కేటాయింపులకు అనుగుణంగా డిమాండ్‌ను సర్దు బాటు చేసుకునే పరిస్థితి వస్తుంది.
జీవించే హక్కు పోయి...
పాత చట్టం ప్రకారం, కార్మికుల వేతనాలకు 100%, మెటీరి యల్‌కు 75% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. కొత్త బిల్లు ప్రకారం ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 90:10, ఇతర రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించాలి. 2020–21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి లక్షా పదివేల కోట్లు కేటాయించింది.
ఆనాడు కేంద్రం రూ. 99 వేల కోట్లు భరిస్తే, రాష్ట్రాలు రూ. 11 వేల కోట్లు మాత్రమే భరించాయి. కానీ, ఈ బిల్లు ప్రకారం రూ. 44 వేల కోట్లు భరించాలి. దీనివల్ల రాష్ట్రాలపై భారం పడుతుంది. పేద, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. నిధుల భారం పెరిగితే రాష్ట్రాలు కార్మికుల డిమాండ్‌ను నమోదు చేయకుండా తప్పించుకునే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు అప్పులు తెచ్చి రోజువారీ పబ్బం గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నిధులు లేవనే పేరుతో చట్టానికే మంగళం పాడే ప్రమాదం ఉంది.
పాత చట్టంలో పనుల ప్లానింగ్ గ్రామ సభల స్థాయిలో జరిగేది. కానీ, ఈ బిల్లు పనుల ప్లానింగ్‌ను కేంద్రీకృతం చేస్తోంది. దీనివల్ల పంచాయతీల అధికారాలు హరించుకుపోతాయి. నేడున్న సాంకేతిక విధానాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిందే. ఈ కొత్త బిల్లు బయోమెట్రిక్ అటెండెన్స్, జియోస్పేషియల్ టెక్నాలజీ వంటి పర్యవేక్షణ పద్ధతులను ప్రవేశపెడుతోంది. దీనివల్ల కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా పాత చట్టం పని హక్కును కల్పించింది. కానీ ఈ బిల్లు ఆ హక్కును నిరాకరిస్తోంది. పేదరికం, నిరుద్యోగం విస్తరిస్తున్నఈ తరుణంలో ఈ బిల్లు గ్రామీణ నిరుద్యోగాన్ని మరింతగా పెంచి, వెట్టిచాకిరీ వైపు నడిపిస్తుంది. ఈ కొత్త బిల్లు సామాజిక పురోగమ నానికి కాకుండా, భూస్వామ్య సంస్కృతికి జీవం పోస్తుంది. కోట్లాది మంది పొట్టగొట్టే ఇలాంటి బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతివ్వడం శోచనీయం.

వ్యాసకర్త- వి. వెంకటేశ్వర్లు
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి


