విశ్లేషణ
దశాబ్దాల తరబడి పరిశ్రమలను కట్టిపడేసిన శృంఖలా లను తెగ్గొట్టి, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడమే మన లక్ష్య మైతే, సత్వర కార్యాచరణను చూపాల్సిన అవసరం ఉంది.
జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం ఆర్థిక సంస్కరణ లను కొన్నాళ్లు అటకెక్కించింది. ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయ ప్రయోజనాలను మూటగట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడంపైనే అది దృష్టిని కేంద్రీకరించింది.
వ్యవసాయ సంస్కరణలు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైనప్పటి నుంచి మరింత ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది. అయితే, భార తీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో విధాన నిర్ణేతలు మళ్ళీ కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు.
జీఎస్టీతో మొదటి అడుగు
సుంకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి ఏమాత్రం కుంటుపడకుండా నివారించడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యంగా మారింది. అమెరికా సుంకాలు ఎగుమతులపైనే కాకుండా, ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాకు వస్తువులు సరఫరా చేసే సంస్థలలోని ఉద్యోగాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి.
చాలా కాలంగా జాప్యం చేస్తూ వచ్చిన వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) మార్పు చేర్పులను పూర్తి చేయడాన్ని ప్రభుత్వం ఆ దిశగా వేసిన మొదటి అడుగుగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో అమెరికా సుంకాలు ప్రకటించడంతోనే, సెప్టెంబర్‌లో జీఎస్టీ రేట్లకు కోత పెట్టారు. శ్లాబులను తగ్గించారు. క్రమరాహిత్యాలను వేగంగా తొలగించారు.
ఫలితంగా పండుగల సీజన్‌లో అమ్మకాలు విజృంభించాయి. కొన్నేళ్ళుగా మందగొడిగా సాగుతున్న అమ్మకాలతో నీరసించిన వ్యాపార వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది. జీఎస్టీ తేవడంలోని అసలు లక్ష్యం ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం. తీరా, అది అనేక తలల జీవిలా తయారైంది.
అంతకుముందు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక రకాలుగా ఉన్న పన్నుల వ్యవస్థతో పోలిస్తే జీఎస్టీ మెరుగైనదనడంలో సందేహం లేదు. కానీ, సులభతరం చేయడా నికి, వ్యాపార సంస్థలకు మరింత స్నేహ పూర్వకంగా మార్చడానికి జీఎస్టీలో మార్పులు అవసరమయ్యాయి.
కార్మికుల కోసం రెండో అడుగు
రెండవ అడుగు వేయడంలో కూడా ప్రభుత్వం ఎట్టకేలకు తెగువను ప్రదర్శించింది. కార్మిక అంశాలకు సంబంధించి ఇప్పు డున్న 29 చట్టాల స్థానంలో నాలుగు స్మృతులను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇది ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరుకునపెట్టే నిర్ణయమే. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం. వ్యవస్థీకృత, అవ్యవసీకృత రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు సంబంధించినది.
నిజానికి, ఈ స్మృతులను పార్లమెంట్ 2020లోనే ఆమోదించింది. కానీ, వాటిని నోటిఫై చేయలేదు. నిబంధనలను అధికారికంగా అమలులోకి తేలేదు. ఇప్పుడు నోటిఫై చేశారు కనుక, నిబంధనలు వచ్చే రెండు నెలల్లోపల వాస్తవ రూపం ధరిస్తాయి.
యాజ మాన్యాలు వాటిని అమలు చేసేందుకు కొంత సమయం పట్టవచ్చు. కార్మిక సంఘాలు వీటిపై రుసరుస లాడుతున్నప్పటికీ, వాస్తవానికి, అవి విస్తృతమైన సంఖ్యలో కార్మికులను భద్రతా వలయంలోకి తెస్తున్నాయి. ఇవి కేవలం షెడ్యూల్డు వాటికే కాకుండా, అన్ని రకాల సంస్థలకూ వర్తిస్తాయి.
వేగంగా విస్తరిస్తూ పోతున్న కంప్యూటర్ సిబ్బంది కూడా వాటి పరిధిలోకి వస్తున్నారు. వీటిలో వివిధ చర్య లను రాష్ట్రాలు ఇప్పటికే అమలులోకి తెచ్చాయి. కానీ, కేంద్రం ఆ నిబంధనలను నోటిఫై చేయడంతో, దేశవ్యాప్త ప్రాతిపదికన ఇప్పుడు విస్తరింపజేసినట్లు అయింది.
పరస్పర వైరుద్ధ్యంతో కూడిన నిబంధనలున్న 29 చట్టాలను, కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలలోని అన్ని కోణాలను లెక్కలోకి తీసుకుంటూ, నాలుగు స్థూలమైన స్మృతులుగా తీసుకు రావడం గణనీయమైన చర్యే. దీనివల్ల, వ్యాపార నిర్వహణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇవి వలస పాలనలో 1930ల నుంచి అమలులోకి వచ్చినవి. అప్పటి నుంచి అవి శాసనాల పుస్తకాలలో అలాగే పడి ఉన్నాయి.
అధికార యంత్రాంగపు జాప్యం తగ్గేలా...
పాలనా యంత్రాంగంలోని రెగ్యులేటరీ కొలెస్టరాల్‌ను పెద్ద యెత్తున తగ్గించే విధంగా స్థూలమైన ప్రణాళికలతో నీతి ఆయోగ్ కమిటీ ఈమధ్యనే నివేదిక సమర్పించింది. ఆగస్టులో నెలకొల్పిన ఆ కమిటీకి మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అభివృద్ధి కార్యకలాపాలకు విఘాతంగా పరిణ మిస్తున్న అధికార యంత్రాంగపు నియమ నిబంధనలు, విధానా లకు కోత పెడుతూ, అనేకానేక చర్యలను ఈ కమిటీ ప్రతిపాదించింది.
వ్యాపారాలు సాఫీగా సాగకుండా అడ్డం పడుతున్న రెగ్యు లేటరీ ప్రక్రియలు కేంద్ర స్థాయిలోనే కొనసాగుతున్నాయని అదృష్టవశాత్తూ ఈ కమిటీ గుర్తించింది. దేశ రెగ్యులేటరీ చట్రాన్ని విప్లవాత్మకంగా మార్చి వేయాలని కమిటీ ప్రతిపాదించింది. జన్ విశ్వాస్ సిద్ధాంత్ పేరుతో సంస్థలపై నమ్మకం ఉంచే విధానంతో మెలగాలని పేర్కొంది.
నూతన ప్రతిపా దనలను ఆ విశ్వాస ఆధారిత వైఖరిలో భాగంగా పేర్కొంది. లైసెన్సులు, పర్మిట్లు, నో–అబ్జెక్షన్ సర్టిఫికెట్లు వంటి వాటిని రద్దు చేయడం ద్వారా ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ను అంతమొందించాలని కమిటీ సిఫార్సు చేసింది.
క్రమానుగత తనిఖీల బాధ్యతను అక్రెడిటెడ్ మూడవ పక్షాలకు అప్పగించాలని కూడా కమిటీ కోరింది. ఈ చర్యలు అధికారుల విచక్షణాయుత పాత్రను తగ్గిస్తాయి. మొదటి విడత ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ చర్యలు 1991లో మొదలైన దశాబ్దాల తర్వాత కూడా అధికారులు వేళ్లూనుకునే ఉన్నారు.
విధానాలలో హఠాత్తుగా మార్పులు తీసుకురావద్దనీ, నియంత్రణ విధానాలను అప్డేట్ చేయడానికి ఒక స్థిరమైన కాల వ్యవధిని పెట్టుకోవాలనీ కూడా కమిటీ సిఫార్సు చేసింది. అప్పుడే నిబంధనలలో మార్పుల గతి కొంతవరకు ఊహకందేదిగా ఉంటుందని పేర్కొంది.
చిన్నా చితక పొరపాట్లు లేదా సాంకేతికపరమైన ఉల్లంఘనల్లో పీనల్ నిబంధనలకు వెళ్ళడాన్ని రద్దు చేయాలనీ, తీవ్రమైన నేరాల విషయంలో మాత్రమే అటువంటి శిక్షలు, జరిమానాలు విధించాలనీ కమిటీ ప్రతిపాదించింది.
మరో సమాంతర నీతి ఆయోగ్ కమిటీ కూడా వరుసగా అనేక సంస్కరణలను, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థల విషయంలో ప్రతిపాదించింది. కంపెనీల చట్టం కింద పాటించవలసిన నియమాలను వాటి విషయంలో సడలించాలని ఆ కమిటీ కోరింది.
చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లింపు లలో జాప్యం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కూడా కమిటీ కోరింది. ఈ రంగం ప్రయోజనాలను నేరుగా దెబ్బ తీస్తున్న, కొనసాగుతున్న సమస్యగా కమిటీ దాన్ని పేర్కొంది.
జీడీపీ వృద్ధికి సంబంధించి 2025–26 సంవత్సరపు ద్వితీయ త్రైమాసికపు డేటా 8.2 శాతంగా ఉండటం ఉత్సాహపరచేదిగా ఉంది. కానీ, పూర్తి సంవత్సరానికి సంబంధించిన అంచనా దాదాపు 6.5 నుంచి 7 శాతంగా మాత్రమే ఉంది.
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల కేటగిరీలో అడుగు పెట్టేందుకు ఇంకా వేగంగా ముందుకు సాగుతూ 9 నుంచి 10 శాతం వృద్ధి రేటును కనబరచవలసిన అవసరం ఉంది. అందుకు, అమెరికా సుంకాల ప్రభావం లేకుండా చేసేందుకు ఇప్పటి మాదిరిగానే, లోతైన సంస్క రణలు తీసుకురావాలి. ఈ ఆచరణాత్మక, సానుకూల అడుగులు దీర్ఘకాలంలో కూడా స్థిరంగా ముందుకు పడాలి.

వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్
సీనియర్ ఫినాన్షియల్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


