విశ్లేషణ
ఆధిపత్యం వహిస్తున్న ఒక సంస్థ (ఈ సందర్భంలో ‘ఇండిగో’) తన ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచకుండా నివారించేందుకు ఆ సంస్థను విభజించవలసిందని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ ఆదేశించవచ్చు. అమలులో ఉన్న మరి ఏ ఇతర చట్టాలలోని అంశాలు కూడా అందుకు అడ్డుపడటానికి లేదు.
వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆకాశయానం జీవనాడి లాంటిది. దాంతో భారతదేశ గగనతలం సహజంగానే కిటకిటలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఒకే విమానయాన సంస్థ ప్రాబల్యం వహిస్తే, అది మొత్తం దేశాన్ని అస్థిరపరుస్తుంది. విమాన ప్రయాణాల్లో అత్యంత అస్తవ్యస్తమైన కాలంగా 2025 డిసెంబర్ చిరకాలం గుర్తుండిపోతుంది. నియమ నిబంధనల పట్ల భారత ఆకాశరాజుగా వెలుగొందుతున్న ‘ఇండిగో’ చూపిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం.
ఈ సంస్థ తనకు 350కి పైగా విమానాలున్నాయని ఈ మధ్యనే గొప్పగా చాటుకుంది. దేశ విమానయాన మార్కెట్లో అది దాదాపు 64 శాతం వాటా చేజిక్కించుకుంది. కానీ, గత కొద్ది రోజుల్లో వేలాది విమాన సర్వీసులను రద్దు చేయడంతో, లక్షలాది మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వ్యాపార ఎగ్జిక్యూటివ్‌లు విలువైన లావాదేవీలను కోల్పోయారు.
అత్యవసర వైద్య సేవలకు వెళ్ళవలసిన వారిని వేరే మార్గాల గుండా పంపవలసి వచ్చింది. మహిళలు, పిల్లల అగచాట్లు చెప్పనలవి కాదు. ఇదే అదనుగా, విమాన ఛార్జీలు ఆకాశాన్ని అంటాయి. హోటళ్ళు కూడా వీలైనంత సొమ్ము చేసుకునేందుకు రేట్లను పెంచేశాయి.
అవసరమైన నియమావళి
అలసటను తగ్గించే సిబ్బంది విశ్రాంత నియమాల సాధారణ అమలు తతంగం కాస్తా చారిత్రక విమానయాన వినాశకర చర్యగా పరిణమించింది. విమాన సేవలలో ప్రపంచంలోనే భారత్ మూడవ పెద్ద మార్కెట్. ఈ స్థితిలో ఒకే సంస్థ గుత్తాధిపత్యం వహిస్తే చోటుచేసుకోగల అవాంఛనీయ పరిణామాలకు ఈ ఉదంతం తిరుగులేని నిదర్శనంగా నిలిచింది.
పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సవరించిన గగనతల విధుల సమయ పరిమితు (ఎఫ్.డి.టి.ఎల్.)లు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. పైలట్ల బడలికను తగ్గించి, ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఒక ఆదేశంతో, రెండవ విడత నిబంధనలను నవంబర్ 1 నుంచి అమలులోకి తెచ్చారు. ఈ నిబంధనలు పైలట్లు రాత్రిళ్ళు జరిపే ల్యాండింగ్‌ల సంఖ్యపై పరిమితి విధించాయి. విధిగా తీసుకోవాల్సిన విశ్రాంతి వ్యవధిని పొడిగించాయి.
పైలట్లు ఎంతసేపు విమానాన్ని నడుపవచ్చునో తెలిపే నిబంధనలున్నాయి. నిజానికి, శక్తికి మించి పనిచేస్తున్న సిబ్బంది ఉన్న పరిశ్రమలో– వారి భద్రతకు, ప్రయాణికుల రక్షణకు ఏనాటి నుంచో అమలుకావలసిన నిబంధనలవి. ‘స్పైస్ జెట్’, ‘ఆకాశ ఎయిర్’ వంటి చిన్న సంస్థలు కొద్దిపాటి ఇబ్బందులతో నిబంధనలను పాటించడం ప్రారంభించాయి. నిబంధనల పట్ల మన్నన చూపడంలో ఇండిగో వైఫల్యం దాని దురహంకారాన్నీ, మార్కెట్ ప్రాబల్య దుర్వినియోగాన్నీ ప్రతిబింబించింది.
ముందే హెచ్చరించిన స్థాయీ సంఘం
‘ఇండిగో’ సాచివేత ధోరణి ఈ ప్రహసనానికి మూల బిందువైంది. ఈ సంస్థ మినహాయింపులు కోరుతూ అక్టోబర్ చివరి వరకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. నూతన ఎఫ్‌డీటీఎల్ వ్యవస్థకు తగ్గట్లుగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోలేదు. పైలట్లకు నిర్దేశించిన నూతన నిబంధనలను పక్కదోవ పట్టిస్తున్న సంస్థను ఒక పార్లమెంటరీ ప్యానెల్ ఆగస్టులోనే హెచ్చరించిందని ఇపుడు వెల్లడవుతోంది.
భారత విమానయాన రంగం ఒక ‘కీలకమైన మలుపు తీసుకునే స్థితి’లో ఉందని రవాణా, టూరిజం, సంస్కృతికి చెందిన స్థాయీ సంఘం పార్లమెంట్‌కు సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. విమానాల సంఖ్య శీఘ్రగతిన పెరుగుతోంది; కానీ పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని పెంచుకునే ప్రక్రియ మందగతిన సాగుతోందని అది స్పష్టం చేసింది.
పైలట్ల అలసట, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిపై పడుతున్న మితిమీరిన భారం, మానవ వనరుల కొరతలు... త్వరితగతిన సాగుతున్న వ్యాపార విస్తరణ ఈ రంగాన్ని ఒక ప్రమాదకర స్థితికి నెడుతున్నాయని హెచ్చరించింది. ‘ఇండిగో’కు డీజీసీఏ సంజాయిషీ నోటీసు జారీచేసి, నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు నడుం బిగించినప్పటికీ, ఈ కేసును దేశ పోటీ నియంత్రణ వ్యవస్థ పరిశీలన కిందకు తేవలసిన అవసరం ఉంది.
ఇంచుమించుగా రెండు సంస్థలు ప్రాబల్యం వహిస్తున్న మార్కెట్లో దాదాపు మూడింట రెండు వంతులను గుప్పిట పెట్టుకున్న ఈ విమానయాన సంస్థ ఆధిపత్యం తగు ప్రక్రియ ద్వారా రుజువు కావలసి ఉన్నప్పటికీ, దానిపై ఎవరికీ కొద్దిగా కూడా సందేహం లేదు. ‘‘గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల సగటు టర్నోవరుపై 10 శాతం వరకు’’ జరిమానా విధించవచ్చని కాంపిటీషన్ చట్టంలోని 27వ సెక్షన్ నిర్దేశిస్తోంది. ప్రతిస్పర్థ–విరోధి చట్టం అందుకు వీలు కల్పిస్తోంది.
ఒక సంస్థ తన ‘ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచినందుకు’ పై అంశాన్ని పరిశీలించడంలో తప్పు లేదు. కాకపోతే, చట్టంలోని 26వ సెక్షన్ నిర్దేశించిన విధంగా తగు విధానం కింద ఆ సంస్థ ‘ఆధిపత్యం’, ‘దుర్వినియోగం’ అంశాలను పరిశీలించవలసి ఉంటుంది.
సంస్థను విభజించడమే మార్గమా?
ఆధిపత్యం వహించే అన్ని సంస్థల విషయంలో, ప్రాధాన్యం వహించగల సెక్షన్ ఒకటి ఉంది. సాపేక్షంగా చూస్తే, దాన్ని ఎవరూ గమనికలోకి తీసుకోవడం లేదు. ఇంతవరకు దేశంలో దాన్ని ఉపయోగించలేదు కూడా! దాన్ని కూడా పరిశీలనకు తేవాలి. ఆధిపత్యం వహిస్తున్న ఒక సంస్థ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచకుండా నివారించేందుకు ఆ సంస్థను విభజించవలసిందని కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించవచ్చు.
అమలులో ఉన్న మరి ఏ ఇతర చట్టాలలోని అంశాలు కూడా అందుకు అడ్డుపడటానికి లేదు. చట్టంలోని 28వ సెక్షన్ దీన్ని పేర్కొంటోంది. అలా విభజించడానికి అనుసరించవలసిన తీరుతెన్నులను సెక్షన్ 28(2)లోని వివిధ ఉప సెక్షన్లు విశదపరుస్తున్నాయి. అటు వంటి చర్య తీసుకున్న పెక్కు దృష్టాంతాలు ప్రపంచ వ్యాప్తంగా మనకు కనిపిస్తాయి.
ఆధిపత్యం వహిస్తున్న సంస్థలను ‘యాంటీ ట్రస్ట్’ అధికారులు విభాగాలుగా చేసిన ఉదాహరణలు అమెరికాలో ఉన్నాయి. ‘స్టాండర్డ్ ఆయిల్’ను 1911లో, ‘ఎ.టి.–టి’ని 1982లో అలా విభజించారు. వాటిలో రెండవ దాని విషయంలో, చిన్నతరహా, ప్రాంతీయ టెలికాం ఆపరేటర్ల సృష్టి జరిగింది. ‘ఏషియానా ఎయిర్ లై¯Œ ్స’ ను ‘కొరియన్ ఎయిర్’ అలానే తనలో ఇముడ్చుకుంది. ‘ఐ.టి.ఎ. ఎయిర్ వేస్’లో ‘లుఫ్తాన్సా’ పెట్టుబడులు పెట్టింది.
అంతిమంగా, ఈ సంక్షోభం, ఒక సత్యాన్ని ప్రబోధిస్తోంది. విమానయానం మరో సాధారణ వ్యాపారం కాదు. మన వృద్ధి గమనంలో అదొక కీలకమైన అనుసంధాన కణజాలం. దాన్ని శిక్షించడం ఎలాగన్నది ప్రశ్న కాదు. తిరిగి నిలకడగా సేవలు సాగేట్లు చూడటం ఎలా అన్నది ముఖ్యం.
ప్రయాణికుల భద్రతకు, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ నియంత్రణ సంస్థలు నిబంధనలను కచ్చితంగా అమలుపరచి తీరాలి. డీజీసీఏ, సీసీఐ వంటి పర్యవేక్షణ సంస్థలు మార్కెట్‌పై ‘ఇండిగో’కున్న పట్టును సడలించి తీరాలి. అప్పుడే మనం రెక్కలు విప్పుకున్న ఆకాశం గురించి మాట్లాడుకోగలుగుతాం!
వ్యాసకర్త: ధనేంద్ర కుమార్, ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ మాజీ చైర్మన్,
‘కాంపిటీషన్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా’ చైర్మన్


