అభిప్రాయం
స్వేచ్ఛగా, విమర్శనాత్మకంగా పనిచేసే పత్రిక... ప్రజాస్వామ్యానికి రక్తనాళం లాంటిది.– నెల్సన్ మండేలా
ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విని ఉండే అవకాశం లేదు. ఆయన దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే తనకు అనుకూల పత్రికల స్వేచ్ఛ మాత్రమే. ప్రశ్నించే పత్రిక అంటే భయం. అందుకే ‘సాక్షి’ మీడియా మీద కత్తి కట్టాడు. కక్ష పెంచుకుని వేధిస్తు న్నారు.
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై 19 కేసులు పెట్టారు. దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. జరిగే అవ కాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది సాధ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం లేని నాయకుడు చంద్రబాబు.
ఇదా విజనరీ లక్షణం?
దేశం భద్రంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యం అంటాడు జాన్ ఆడమ్స్. అమెరికా వ్యవస్థాపకులుగా పిలవబడే ఐదుగురిలో ఆయన ఒకరు. తాము భద్రంగా ఉండాలంటే ప్రశ్నించే పత్రికలు ఉండకూడదని బాబు నమ్మకం.
ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించిన వాళ్లలో ఈయన ప్రథముడు. కానీ ఆయన తనని తాను విజనరీ అని చెప్పుకొంటారు. విజనరీకి ఉండాల్సిన మొదటి లక్షణం పత్రికా స్వేచ్ఛను కాపాడడం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఆ స్తంభం తన సొంత స్తంభం కావాలని చంద్రబాబు కోరిక.
‘సాక్షి’ అంటే చంద్రబాబుకు ఎందుకు భయమంటే... అది ప్రశ్నిస్తుంది; ప్రజల నిరసనను, అసహనాన్ని, కోపాన్ని, రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల ఆగ్రహం నరసింహస్వామిగా మారి ఆ స్తంభంలోంచి ఉగ్రరూపం బయట పడుతుందని బాబు భయం. అందుకే ‘సాక్షి’ గొంతు నొక్కాలి, కేసులు పెట్టాలి, వీలైతే మూసి వేయించాలి. టీవీ ప్రసారాల్ని అడ్డుకోవాలి. అందుకే ఎడిటర్‌కూ, ఆ మీడియా జర్నలిస్టులకూ అన్ని వేధింపులు, కేసులు!
చారిత్రక అవసరం లోంచి...
‘సాక్షి’ ఒక చారిత్రక అవసరం లోంచి పుట్టింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల్ని, ప్రజా క్షేమం కోసం ఆయన చేస్తున్న మహోత్తర కార్యక్రమాల్ని, జనాన్ని ప్రేమించే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నందుకు కత్తి కట్టి, మంచి పనుల్ని వక్రీకరిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ వచ్చింది.
అబద్ధం నిజం అవుతున్నపుడు, నిజాల్ని పచ్చి నిజాలుగా చెప్పడానికి వచ్చింది. నిజం అంటే చంద్ర బాబుకు భయం. అందుకే ‘సాక్షి’ అంటే భయం. ప్రశ్నను భరించ లేని కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. ‘సాక్షి’లో వచ్చే కథ నాల్లోని కఠోర సత్యాలను భరించలేక భగ్గుమని ఒళ్లంతా కారం పూసుకుని మండి పడుతున్నారు.
ఇంతకీ ‘సాక్షి’ ఏమడిగింది? నిజాలు చెప్పమని నిలదీసింది. పాలనలోని డొల్లతనాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు వక్రీకరణలకు భాష్యం చెప్పింది. అభివృద్ధి, సంపద సృష్టి పదాలకు అసలు అర్థం అప్పులు, చంద్రబాబు సొంత సంపద సృష్టి అని తాత్పర్యం వివరించింది. బూటకపు మాటలకు ప్రతిపదార్థాన్ని విప్పి చెప్పింది. అందుకే కసి, క్రోధం, పగ!
ప్రశ్నించడమే తప్పా?
18 నెలల్లో చంద్రబాబు ఏం చేశాడు? ‘సూపర్ సిక్స్’ పేరుతో వంచించాడు. ఫించన్లు పెంచినట్టే పెంచి లక్షల్లో లబ్ధిదారుల్ని తగ్గించాడు. ‘అమ్మకు వందనం’ అంటూ తల్లుల్ని తొలగించాడు. ఏడాది ఎగ్గొట్టి, అరకొరగా ఇచ్చాడు. సిలిండర్ పథకంలో చంద్రబాబు గ్యాస్ కొట్టిందే ఎక్కువ.
రైతులకు పంగనామాలు పెట్టి నామ్ కే వాస్తే నిధులిచ్చాడు. అన్ని బస్సులూ ఫ్రీ అని, కొన్ని బస్సుల్లోనే చెల్లెమ్మలు ఎక్కేలా చేశాడు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల పథకం ఊసే లేదు. అయినా ‘సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్’ అని ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటే ‘సాక్షి’ ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?
ఎమ్మెల్యేలు తమ నియో జకవర్గాల్ని సంస్థానాలుగా భావించి ప్రజలతో కప్పం కట్టించుకుంటూ, పాలెగాళ్లలా అన్ని వనరుల్నీ దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడం తప్పా?
పేకాట క్లబ్బులు, గంజాయి బ్యాచ్‌లు ఆడపిల్లలపై అత్యాచారాలు యథేచ్ఛగా సాగిస్తుంటే, పోలీసులు చూసీచూడనట్టు ఉంటే ‘సాక్షి’ కూడా చూసీ చూడనట్టుండాలా? అన్ని రంగాల్లో వైఫల్యాలు చెంది తండ్రీ కొడుకులు విమానాల్లో తిరు గుతూ, పెట్టుబడుల పేరిట దేశాలన్నీ పర్యటిస్తూ కాశీమజిలీ కథలు చెబుతూ ఉన్నా కూడా మౌనం వహించాలా?
వైసీపీ హయాంలో, జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని గోబెల్స్ ప్రచారం చేసినవాళ్లు 18 నెలల్లో చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా ఎందుకు అప్పులు చేశారో చెప్పగలరా? అనేక పథకాలతో ప్రజలకు చేరువై, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ పై చిమ్మిన విషాన్ని చూసి ఒకవేళ గోబెల్స్ బతికి ఉంటే మళ్లీ ఆత్మహత్య చేసుకునేవాడు.
సువిశాల రష్యాలోని జార్ చక్రవర్తుల అహంకారాన్ని, అరాచకాల్ని ‘ప్రావ్దా’ పత్రిక ద్వారా లెనిన్ కూల్చేశాడు. ప్రజల గొంతు పత్రిక ద్వారా వినిపించకపోతే పాలకుల గొంతే శిలాశాసనంగా మారుతుందని అంటాడు లెనిన్ . ప్రపంచానికి కమ్యూనిజాన్ని ప్రసాదించిన లెనిన్ పార్టీ నిర్మాణానికి, విప్లవానికి ప్రావ్దా మూలస్తంభం అంటాడు.
పత్రికా స్వేచ్ఛను గౌరవించిన వాళ్లే చరిత్రలో నిలబడ్డారు. కూల్చేయాలని చూసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాదు, ప్రజాస్వామ్యం అంటేనే పత్రికా స్వేచ్ఛ అంటాడు ప్రముఖ అమెరికా పాత్రికేయుడు వాల్టర్ క్రాన్‌కైట్.
కానీ మన చంద్రబాబు పాత్రికేయుల్ని జైల్లో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా మరుక్షణంలోనే పోలీసులు వాలిపోయే వ్యవస్థను సృష్టించాడు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై పగబట్టిన వాళ్లంతా చిరునామా లేకుండా పోయారు. చంద్రబాబు కూడా అతీతుడు కాదు. స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూసిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని చెబుతున్న చంద్రబాబు చేతిలో అసలు దీపమే లేదు. ఆయన చేతిలో ఉన్నది అగ్గిపెట్టె మాత్రమే! దాంతో రాష్ట్రాన్ని తగలబెట్టే పనిలో ఉన్నాడు. సత్యం జయిస్తుంది. ‘సాక్షి’ కూడా జయిస్తుంది. దాని గొంతు నొక్కడం సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రజల గొంతు!
వ్యాసకర్త: భూమన కరుణాకర రెడ్డి
మాజీ ఎమ్మెల్యే


