breaking news
Bhumana Karunakara Reddy
-
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు. ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం, చెప్పిన నిజం నిలబెట్టడం కోసం, పేదవాడి కడుపు నింపడం కోసం, దిగువనున్న వారికి ఎగువ తరగతి చదువు అందివ్వడం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమ పథకాల నిత్యవికాసం కోసం, జనం కొరకు, జనం మధ్య నిలబడి పనిచేసినవారు మరొకరు.మొదటి వారు చంద్రబాబు నాయుడు అయితే, రెండవ వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అబద్ధానికీ నిజానికీ, చీకటికీ వెలుగుకూ మధ్య ఉన్నంత స్పష్టమైన తేడా ఈ ఇద్దరిలో! ఏమీ చేయకుండానే చేసినట్లు, చేస్తున్నట్లు, చేస్తూనే ఉన్నట్లు చెప్పి నమ్మించగలగడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పత్రికలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాగానికి తాళం వేసి, తప్పెట్లు మోగించి అభివృద్ధి ఆకాశం దాటేసింది అంటూ అరుస్తాయి. చిటికెల పందిళ్ళకు, ఊహల ఉత్సవాలకు, గాలిలో ఘనమైన మేడలకు, గ్రాఫిక్ ఇంద్రజాలాలకు బ్రాండ్ అంబా సిడర్ చంద్రబాబు. నేలమీద నిలబడి, కరోనాలో సైతం ప్రజల కోసం కష్టపడి, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.శ్రీవారి పనులు ఆపొద్దు!పదుల సంఖ్యలో ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నిలబెడతానని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన మొదటి రాక్షస రాజకీయ నాయకుడు ఈయనే. నిజానికి హైందవ ధర్మానికీ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికీ అపారమైన సేవ చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. అంత సేవ చేసిన ఆయనను చంద్రబాబు విష ప్రచారపు ముసుగు వేసి అన్యుడని అవహేళన చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఎన్నికల వరకు తిరుమల శ్రీవారికి, హైందవ ధర్మానికి ఆయన చేసిన సేవ ప్రత్యక్షంగా చూసినవాడిగా, ఆత్మ సాక్షిగా గుండెమీద చేయి వేసుకుని ఈ మాటలు చెబుతున్నాను. ఈ వ్యాసం రాస్తున్నాను. అందరికీ తెలియాల్సిన పచ్చి నిజాలివి. పచ్చమీడియా ఎప్పటికీ అంగీకరించని వాస్తవాలివి. తిరుమల శ్రీవారి మీద జగన్‌కు అపారమైన భక్తి, విశ్వాసం. 2019లో అఖండమైన మెజారిటీతో జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరమే అధికార పీఠంపై కూర్చున్నారు. ఆ రోజు జగన్‌తో పాటు నేనూ కారులో ఉన్నాను. అప్పుడు గరుడ వారధి (శ్రీనివాస సేతు) పనులు జరుగుతున్నాయి.ఆ స్తంభాలను చూసి ‘ఏమిటిది’ అని అడిగారు. ‘‘ఇది శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం నిర్మి స్తున్న ఫ్లై ఓవర్. దాదాపు 40 కోట్లు చంద్రబాబు హారతి చేశాడు. దీన్ని ఆపడం మంచిది’’ అని కారులోని ఓ ముఖ్య వ్యక్తి చెప్పాడు. దానికి జగన్ నవ్వుతూ, ‘‘శ్రీవారికీ, ఆయన భక్తులకూ ఉపయోగపడే వంతెనను ఆపడం అన్యాయం. వాటా తీసుకున్న వారి పాపం వారికే తగులుతుంది, తగిలింది. ఆపొద్దు, మరింత మెరుగుగా నిర్మించండి’’ అన్నారు. అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించినా ఆపకూడదు అన్నది ఆయన భావన.అప్పటికి కొద్దికాలం క్రితమే ఆయన సుదీర్ఘమైన పాద యాత్రతో 3,648 కి.మీ. నడిచి ఉన్నారు. ఆ అలసట కూడా మరిచి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళారు. అలాంటి భక్తుడిని అన్యమతస్థుడు అని చంద్రబాబు, ఆయన మీడియా కొండంత ప్రచారం చేశాయి. జగన్ ఎంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తా రంటే, ఆయనకు తిరుపతి గంగమ్మ గురించి ఆమె శ్రీవారి చెల్లెలు అని చెప్పాను. ఆయన ముందుగా, ముఖ్యమంత్రిగా గంగమ్మను దర్శించుకునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాల పునరుద్ధరణ, గోసంరక్షణశ్రీవారి వైభవ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు జగన్ చేసిన సేవ మరెవ్వరూ చేయలేదు. భక్తికీ, రాజకీయానికీ ముడిపెట్టేంత నైచ్యానికి ఆయన ఏనాడూ దిగ జారలేదు. ధర్మాచరణ అంటే రాజకీయ అవసరాలకు శ్రీవారినీ, ప్రసాదాన్నీ వాడుకోవడం కాదు. శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేపకొవ్వు కలిసి కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసిన వాళ్ళు భక్తులా? నిజానికి ఆ కొవ్వు వారి మస్తిష్కపు మకిలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలో నిరంతర వేదఘోష ప్రతిధ్వనించింది. కోవిడ్ కాలం నుండి ‘నాద నీరాజన వేదిక’ మీద నిత్యం భారత, భాగవత, రామాయణ, సుందరకాండల ప్రవచన పరిమళం ఆ వైకుంఠాన్ని చేరింది.శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది జగన్. ఆ నిధుల ద్వారా దేశ వ్యాప్తంగా 3,500 ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ జరిగింది. దాన్ని సహించలేక ఆ రోజు ఆ ట్రస్టును విమర్శించాడు చంద్రబాబు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకో వెళ్తున్నాయనీ, అధికారం వస్తే ఆ ట్రస్టు రద్దు చేస్తామనీ బీరాలు పలికాడు. ఇప్పుడు ఆ టికెట్ల సంఖ్య పెంచి, ఆలయాలు నిర్మిస్తాం అంటున్నాడు. ఎంత వంచన! గోసంతతిని మరింత పెంచాలని భావించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విరాళాల క్రింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు, ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకువచ్చాం. వాటి సంర క్షణ, సంతతి వృద్ధికి మొదటిసారిగా ప్రణాళికలు తయారు చేసి అమలు పరిచాం. తెలుగు రాష్ట్రాలలోని గోశాలలను గుర్తించి మేత, నిర్వహణ వ్యయం అందించాం. అనేక ఆలయాలకు గోవులను విరాళంగా అందించాం. గోసేవా భాగ్యం హైందవ భక్తులందరికీ అందాలని అలిపిరి వద్ద గోమాత ప్రదక్షిణ శాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలో గోశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పత్రికలు, మీడియా చెప్పాయి. ఇప్పటి దేవ స్థానం అధ్యక్షుడే ముందు కాదని... తర్వాత అంగీకరించాడు. వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడు నవనీత ప్రియుడు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ యాంత్రికంగా జరిగేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగను చిలికించి అప్పుడే తీసిన ఆ నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించే ఏర్పాటు చేశారు. ఎంత భాగ్యం ఇది. ఎంత సేవ ఇది. ఎంత మంచి ఆలోచన ఇది.ఎన్నెన్ని సంస్కరణలు!తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను, మఠాధిపతులను ఆహ్వానించి హైందవ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. ఇతర మతాల వారు హిందూమతం స్వీకరించాలి అనుకుంటే అందుకు కేంద్రం తిరుమల కావాలని తీర్మానించాం. అందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇంతటి విప్లవాత్మక నిర్ణయం మొదటిగా తీసుకున్నది తి.తి.దేవస్థానమే. దానికి కారణం జగన్. వేదమూర్తి, వేదస్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేద ఘోష వినిపించాలని, భక్తులు అది విని తరించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం ప్రారంభించాం. యువతరాన్ని సక్రమ మార్గంలో ఉంచాలని, శ్రీవారి భక్తి మరింతగా వారి హృదయాలలో నిండా లని శ్రీవారి గోవింద నామకోటి ప్రారంభించాం. యువతీ యువకులు గోవింద నామకోటి రాసి, ఆలయ అధికారులకు అందజేస్తే వారి కుటుంబానికి శ్రీవారి బ్రేక్ దర్శన సౌకర్యం కలిగించాం. దేశంలోని ప్రముఖ పండితుల సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని గుర్తించాం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించాం.శ్రీవారికి, శ్రీవారి వివిధ ఆలయాలలో ఉపయోగించిన పుష్పాలను వృథాగా పారవేయక వాటితో అగరుబత్తుల తయారీ ప్రారంభించాం. సప్తగిరులకు గర్తుగా ఏడురకాల పరిమళాల అగరుబత్తులు తయారు చేశాం. స్వామివారికి అలంకరించిన సుమాల పరిమళం... అగరుబత్తీగా మన ఇంట వెలగడం, ఆ పరిమళ భక్తి పరవశంలో మనం లీనం కావటం ఎంత అదృష్టం. అదీ గాక దీనివల్ల ఎందరో మహిళలలకు ఉపాధి ఏర్పడింది. బ్రేక్ దర్శనాలను దాదాపు తగ్గించి, సామాన్య భక్తుల దర్శ నాలకు ప్రాముఖ్యం ఇచ్చాం. క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు కాఫీ, టీ, పాలు పంపిణీ చేశాం. కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాం. శ్రీవారి ప్రసాదాల కవర్లను కూడా ప్లాస్టిక్ రహితంగా తయారుచేయించాం. కొండమీద పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాం. శిలాతోరణం వద్ద 10 ఎకరాలలో పవిత్ర ఉద్యాన వనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాలలో పవిత్ర శ్రీగంధ ఉద్యానవనం ఏర్పాటు చేశాం.2021 అక్టోబరు 30, 31 తేదీలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జాతీయ గో సమ్మేళనం నిర్వహించాం. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. తిరుమలలో నేడు ప్రతి పౌర్ణమికి శ్రీవారికి జరుగు తున్న గరుడసేవ ప్రవేశపెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాలుగు మాడ వీధులలో భక్తులు పాదరక్షలు ధరించ రాదని నిర్ణయం తీసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. అలిపిరి నుంచి కాలినడకన దర్శనం చేసుకున్న సమయంలో వారికి ఈ ఆలోచన వచ్చిందట. అలాంటి వ్యక్తిని, భక్తుడిని బూట్లు ధరించి పూజలు చేసేవారు విమర్శించడం ఎంత అన్యాయం?భక్తుల కోసం...అలిపిరి కాలినడక మార్గపు పైకప్పు ఎప్పుడో 40 సంవ త్సరాల క్రితం నిర్మించారు. అది పూర్తిగా పాడయింది. భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఓ దాత సహాయంతో, దాదాపు 25 కోట్ల వ్యయంతో దానిని పునర్నిర్మించాం. ఆ ఆదేశం ఇచ్చింది జగనే. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. కార్తీక మాసంలో మహిళల సామూహిక దీపారాధన ఉత్సవాలను 2020 నవంబరు 30న ప్రారంభించాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాం.తిరుమలలో రూ. 100 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ మ్యూజియంలో సుమారు 4 వేల అరుదైన, అపురూపమైన హైందవధర్మ కళాఖండాలు, దేవతామూర్తులు రూపకల్పన చేశాం. శ్రీవారి వైభవం ప్రపంచంలోని వారందరూ తెలుసుకోవాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను హిందీ, కన్నడ భాషల్లో ప్రారంభించింది జగనే.తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో అధునాతన సి.టి. స్కాన్, ఎక్స్ రే మిషన్లు, 34 కోట్ల రూపాయల వ్యయంతో రోగుల కోసం నూతన గదులు నిర్మించాం. పేదలకు ఉచితంగా మోకాలు ఆప రేషన్లను ఆరోగ్యశ్రీ క్రింద చేయించాం. చెవుడు, మూగ పిల్లలకు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను ఉచితంగా చేయించాం. పెదవి చీలికతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్మైల్ లైన్ సంస్థ సహకారంతో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు నిర్వహించాం.శ్రీవారికి తల్లి వకుళమాత. ఆమె ఆలయాన్ని ఏ పాలక మండలీ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆ శిథిల ఆలయాన్ని ఓ దాత సాయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో వైభవంగా నిర్మించాం. దాన్ని జగన్ 2022 జూన్ 23న ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి జరిగే అన్ని సేవలూ భక్తులందరూ దర్శించాలని, వైభవోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాలలో నిర్వహించాం. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి అనుమతితో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు ఉండేలా మార్పు చేశాం. దానివల్ల ఏటా దాదాపు 8 లక్షలమంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించు కున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల వారికి స్వామిపట్ల మరింత భక్తి భావం ఏర్పడాలని, వారికి ఉచిత రవాణా, ఆహార, వసతి ఏర్పాట్లను చేసి వైకుంఠద్వార దర్శనం చేయించాం.ఉద్యోగుల కోసం...తి.తి.దే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగి చని పోయిన 90 రోజుల లోపు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. అంతకు ముందు ఆ ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పట్టేది. ఇందులో భాగంగా ఒకేరోజు 119 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. ఈ మార్పులు జగన్ వల్లే సాధ్యమయ్యాయి. తి.తి.దేవస్థానం ఉద్యోగులకు చెన్నై, బెంగళూరు నగరా ల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించేలా 2022 జనవరి 7న ఒప్పందం చేసు కున్నాం. శ్రీవేంకటేశ్వర మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తెచ్చాం. వీరందరికీ సీనియారిటీ, హెూదాను బట్టి జీతాన్ని 3 వేల నుంచి 20 వేల వరకు పెంచాం.తి.తి.దేవస్థానం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలు ఒక చరిత్ర. ఈ ఉద్యోగులందరికీ న్యాయ వివాదాలు లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 300 ఎకరాల భూమిని సేకరించాం. ఇందుకోసం ఉద్యోగులు చెల్లించాల్సిన రూ.60 కోట్లు యాజమాన్యమే కలెక్టరుకు చెల్లించేలా చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని చదును చేసి, రోడ్లు, కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. ప్రతి ఉద్యోగికీ 50 అంకణాల భూమి చొప్పున 5,518 మంది ఉద్యోగులకు జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమిని ఆనుకుని ఉన్న మరో 132 ఎకరాల భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాం. తి.తి.దే. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీకాళహస్తి మండలం, పల్లం వద్ద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాం. కానీ అధికార మార్పిడి వల్ల నీలినీడలు ఏర్పడ్డాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి వేల ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వం మీద ఎంతో ఆర్థికభారం పడినా ఆయన ఏ సంక్షేమ పథకమూ ఆప లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జనం కోసం, సత్యం కోసం నిలబడినవారు బలయ్యారు. సోక్రటీసుకు విషం పెట్టి, బ్రూనోను శరీరమంతా తగులబెట్టి చంపారు. భగత్‌సింగును ఉరితీశారు. అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల నరికారు. ప్రజల కోసం నిలబడిన వారి అధికారం, జీవిత కాలం స్వల్పమే అయింది. జగన్ అధికార కాలం కూడా వేల అబద్ధాల మబ్బుల ముందు మసక బారింది. ఆయన ఓడిపోయాడే గాని ఇంకా చనిపోలేదు కదా అని తన అనుయాయ, శిష్యుని చేత బహిరంగంగా అనిపించిన పాషాణ హృదయ కుటిలత్వం చంద్రబాబుది. హైందవ ధర్మ రక్షణకు జగన్ చేసింది కొండంత, ఇక్కడ నేను చెప్పింది గోరంత. ఆయనపై నీచ నికృష్ట ఆరోపణలు చేసిన బూట్ల బాబు, గాలి సోకినట్లు గోల చేసే పవనానందులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అందుకే మళ్ళీ మళ్ళీ అంటాను: హైందవానికి ఆలన – జగన్ పాలన అని. ఓం నమో వేంకటేశాయ!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
ఇది ప్రజల గొంతుకను నొక్కడమే!
స్వేచ్ఛగా, విమర్శనాత్మకంగా పనిచేసే పత్రిక... ప్రజాస్వామ్యానికి రక్తనాళం లాంటిది.– నెల్సన్ మండేలాఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విని ఉండే అవకాశం లేదు. ఆయన దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే తనకు అనుకూల పత్రికల స్వేచ్ఛ మాత్రమే. ప్రశ్నించే పత్రిక అంటే భయం. అందుకే ‘సాక్షి’ మీడియా మీద కత్తి కట్టాడు. కక్ష పెంచుకుని వేధిస్తు న్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై 19 కేసులు పెట్టారు. దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. జరిగే అవ కాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది సాధ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం లేని నాయకుడు చంద్రబాబు.ఇదా విజనరీ లక్షణం?దేశం భద్రంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యం అంటాడు జాన్ ఆడమ్స్. అమెరికా వ్యవస్థాపకులుగా పిలవబడే ఐదుగురిలో ఆయన ఒకరు. తాము భద్రంగా ఉండాలంటే ప్రశ్నించే పత్రికలు ఉండకూడదని బాబు నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించిన వాళ్లలో ఈయన ప్రథముడు. కానీ ఆయన తనని తాను విజనరీ అని చెప్పుకొంటారు. విజనరీకి ఉండాల్సిన మొదటి లక్షణం పత్రికా స్వేచ్ఛను కాపాడడం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఆ స్తంభం తన సొంత స్తంభం కావాలని చంద్రబాబు కోరిక. ‘సాక్షి’ అంటే చంద్రబాబుకు ఎందుకు భయమంటే... అది ప్రశ్నిస్తుంది; ప్రజల నిరసనను, అసహనాన్ని, కోపాన్ని, రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల ఆగ్రహం నరసింహస్వామిగా మారి ఆ స్తంభంలోంచి ఉగ్రరూపం బయట పడుతుందని బాబు భయం. అందుకే ‘సాక్షి’ గొంతు నొక్కాలి, కేసులు పెట్టాలి, వీలైతే మూసి వేయించాలి. టీవీ ప్రసారాల్ని అడ్డుకోవాలి. అందుకే ఎడిటర్‌కూ, ఆ మీడియా జర్నలిస్టులకూ అన్ని వేధింపులు, కేసులు!చారిత్రక అవసరం లోంచి...‘సాక్షి’ ఒక చారిత్రక అవసరం లోంచి పుట్టింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల్ని, ప్రజా క్షేమం కోసం ఆయన చేస్తున్న మహోత్తర కార్యక్రమాల్ని, జనాన్ని ప్రేమించే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నందుకు కత్తి కట్టి, మంచి పనుల్ని వక్రీకరిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ వచ్చింది. అబద్ధం నిజం అవుతున్నపుడు, నిజాల్ని పచ్చి నిజాలుగా చెప్పడానికి వచ్చింది. నిజం అంటే చంద్ర బాబుకు భయం. అందుకే ‘సాక్షి’ అంటే భయం. ప్రశ్నను భరించ లేని కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. ‘సాక్షి’లో వచ్చే కథ నాల్లోని కఠోర సత్యాలను భరించలేక భగ్గుమని ఒళ్లంతా కారం పూసుకుని మండి పడుతున్నారు. ఇంతకీ ‘సాక్షి’ ఏమడిగింది? నిజాలు చెప్పమని నిలదీసింది. పాలనలోని డొల్లతనాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు వక్రీకరణలకు భాష్యం చెప్పింది. అభివృద్ధి, సంపద సృష్టి పదాలకు అసలు అర్థం అప్పులు, చంద్రబాబు సొంత సంపద సృష్టి అని తాత్పర్యం వివరించింది. బూటకపు మాటలకు ప్రతిపదార్థాన్ని విప్పి చెప్పింది. అందుకే కసి, క్రోధం, పగ! ప్రశ్నించడమే తప్పా?18 నెలల్లో చంద్రబాబు ఏం చేశాడు? ‘సూపర్ సిక్స్’ పేరుతో వంచించాడు. ఫించన్లు పెంచినట్టే పెంచి లక్షల్లో లబ్ధిదారుల్ని తగ్గించాడు. ‘అమ్మకు వందనం’ అంటూ తల్లుల్ని తొలగించాడు. ఏడాది ఎగ్గొట్టి, అరకొరగా ఇచ్చాడు. సిలిండర్ పథకంలో చంద్రబాబు గ్యాస్ కొట్టిందే ఎక్కువ. రైతులకు పంగనామాలు పెట్టి నామ్ కే వాస్తే నిధులిచ్చాడు. అన్ని బస్సులూ ఫ్రీ అని, కొన్ని బస్సుల్లోనే చెల్లెమ్మలు ఎక్కేలా చేశాడు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల పథకం ఊసే లేదు. అయినా ‘సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్’ అని ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటే ‘సాక్షి’ ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?ఎమ్మెల్యేలు తమ నియో జకవర్గాల్ని సంస్థానాలుగా భావించి ప్రజలతో కప్పం కట్టించుకుంటూ, పాలెగాళ్లలా అన్ని వనరుల్నీ దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడం తప్పా? పేకాట క్లబ్బులు, గంజాయి బ్యాచ్‌లు ఆడపిల్లలపై అత్యాచారాలు యథేచ్ఛగా సాగిస్తుంటే, పోలీసులు చూసీచూడనట్టు ఉంటే ‘సాక్షి’ కూడా చూసీ చూడనట్టుండాలా? అన్ని రంగాల్లో వైఫల్యాలు చెంది తండ్రీ కొడుకులు విమానాల్లో తిరు గుతూ, పెట్టుబడుల పేరిట దేశాలన్నీ పర్యటిస్తూ కాశీమజిలీ కథలు చెబుతూ ఉన్నా కూడా మౌనం వహించాలా? వైసీపీ హయాంలో, జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని గోబెల్స్ ప్రచారం చేసినవాళ్లు 18 నెలల్లో చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా ఎందుకు అప్పులు చేశారో చెప్పగలరా? అనేక పథకాలతో ప్రజలకు చేరువై, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ పై చిమ్మిన విషాన్ని చూసి ఒకవేళ గోబెల్స్ బతికి ఉంటే మళ్లీ ఆత్మహత్య చేసుకునేవాడు. సువిశాల రష్యాలోని జార్ చక్రవర్తుల అహంకారాన్ని, అరాచకాల్ని ‘ప్రావ్దా’ పత్రిక ద్వారా లెనిన్ కూల్చేశాడు. ప్రజల గొంతు పత్రిక ద్వారా వినిపించకపోతే పాలకుల గొంతే శిలాశాసనంగా మారుతుందని అంటాడు లెనిన్ . ప్రపంచానికి కమ్యూనిజాన్ని ప్రసాదించిన లెనిన్ పార్టీ నిర్మాణానికి, విప్లవానికి ప్రావ్దా మూలస్తంభం అంటాడు. పత్రికా స్వేచ్ఛను గౌరవించిన వాళ్లే చరిత్రలో నిలబడ్డారు. కూల్చేయాలని చూసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాదు, ప్రజాస్వామ్యం అంటేనే పత్రికా స్వేచ్ఛ అంటాడు ప్రముఖ అమెరికా పాత్రికేయుడు వాల్టర్ క్రాన్కైట్. కానీ మన చంద్రబాబు పాత్రికేయుల్ని జైల్లో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా మరుక్షణంలోనే పోలీసులు వాలిపోయే వ్యవస్థను సృష్టించాడు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై పగబట్టిన వాళ్లంతా చిరునామా లేకుండా పోయారు. చంద్రబాబు కూడా అతీతుడు కాదు. స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూసిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని చెబుతున్న చంద్రబాబు చేతిలో అసలు దీపమే లేదు. ఆయన చేతిలో ఉన్నది అగ్గిపెట్టె మాత్రమే! దాంతో రాష్ట్రాన్ని తగలబెట్టే పనిలో ఉన్నాడు. సత్యం జయిస్తుంది. ‘సాక్షి’ కూడా జయిస్తుంది. దాని గొంతు నొక్కడం సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రజల గొంతు!వ్యాసకర్త: భూమన కరుణాకర రెడ్డిమాజీ ఎమ్మెల్యే -
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి. తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పీఏ పది నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతోంది?. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకొచ్చారు.తాజాగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా చేస్తున్నారు. గతంలో నాలుగు వేల లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబుఅటవీ శాఖ పరిధిలో పాపవినాశనం చుట్టూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడరు?. టీటీడీ అధికారిగా కాకుండా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీ అనుంగు శిష్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది మీ పాలనలోనే. కూటమి పాలన పాపాన్నిపెంచడానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు గుర్తించండి. ధర్మ వ్యతిరేకంగా మీ పాలక మండలి, సభ్యులు వ్యవహరిస్తున్నారు.పీ-4 కార్యక్రమంపై భూమన స్పందిస్తూ.. రెండు లక్షల 80వేల కోట్లు పేదలకు పంచిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది. మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా 5 శాతం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. మార్గదర్శి బంగారు కుటుంబం అంటూ నటనలు చేస్తున్నారు, ఆర్థిక ద్రోహమే కానీ, మరొకటి లేదు. ఈ మాయ ధనవంతులు.. పేదలకు సహాయం చేయడం అన్నది సాధ్యం కాని విషయం. పేద వాళ్ళు అందరూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గమనించాలి. పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. పీ-4 ఫిలాసఫీ మానవాళికి విఘాతమే తప్ప, ఎలాంటి మేలు జరగదు అని తెలిపారు. -
స్వీయ నియంత్రణే మందు
-
ఏపీకి అన్యాయం జరుగుతుంటే సన్నాయి నొక్కులా?: భూమన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ప్రజలకు దారుణంగా నష్టం వాటిల్లుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతోందని వెఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న బాబు.. కేసీఆర్‌కు పూర్తిగా లొంగి పోయారన్నారు. ఏపీకి ఎంత అన్యాయం జరుగుతున్నా అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఐదు కోట్ల ఏపీ ప్రజలు దారుణంగా నష్టపోతారని, వాటిని ఎలాగైనా ఆపాలని కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు నిరసన దీక్ష చేపడతానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాతే చంద్రబాబు ఆదరాబాదరాగా కేంద్ర జలవనరుల మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కర్నూలులో దీక్ష చేస్తే మరింత ప్రజాదరణ పొందుతారనే ఆందోళనతో మంత్రివర్గ సమావేశంలో చర్చించారే తప్ప నిజంగా ప్రాజెక్టులను అడ్డుకోవాలని కాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా నష్టపోతాయని, కృష్ణా డెల్టా నీటి లభ్యతకు సమాధి కట్టినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిపై కూడా ప్రాజెక్టులు కట్టాలని తెలంగాణ ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్రాలో పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదనే టీఆర్ఎస్ విధానానికి అనుగుణంగానే చంద్రబాబు పట్టిసీమను కడుతూ పోలవరం లాంటి భారీ ప్రాజెక్టును విస్మరించారన్నారు.


