వైఫల్యం కచ్చితంగా కార్పొరేట్ ఉదాసీనతే
భారీ జరిమానాలతోనే దారిలోకి ఆపరేటర్లు
ఇండిగో వ్యవహారంపై విశ్లేషకుల అభిప్రాయం
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి.
అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
భారత్‌లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు.
టికెట్‌కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్‌లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమి చేయొచ్చంటే..
సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్‌లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం.
డీజీసీఏ ఎయిర్‌సేవా పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్‌కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.
బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్‌ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి.
పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.
మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్‌లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్‌గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.
ఏ దేశంలో ఎలా ఉందంటే..
చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్‌లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి.
యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్‌కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్‌దే.
అమెరికా: 2022లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.
కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్‌లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్‌కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి.


