ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32, బయలుదేరాల్సినవి-28.
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్‌డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.
ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.
Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0
— IndiGo (@IndiGo6E) December 10, 2025
ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.
సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్ షెడ్యూల్‌లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే!


