గోవా: ఇటీవల గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్ట పడింది.
లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున 1:17 గంటలకు వారు మేక్‌మైట్రిప్ (ఎంఎంటీ)లో లాగిన్ అయ్యి విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమ్మిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరూ అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానం 6ఈ 1073లో ఢిల్లీ నుండి నేరుగా థాయిలాండ్‌కు వెళ్లిపోయారని వెల్లడయ్యింది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.
ప్రస్తుతం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో తలదాచుకున్న లూథ్రా సోదరులు లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసును ఎదుర్కొంటున్నారు. ఇంతలో గోవా పోలీసులు నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్‌ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్‌పోర్ట్‌లు సస్పెండ్ చేస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.
ఈ కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సావంత్ మాట్లాడుతూ ‘అది థాయ్‌లాండ్ అయినా లేదా మరే ఇతర ప్రదేశమైనా సరే, మేము వారిని అక్కడి నుండి పట్టుకొచ్చి జైల్లో పెడతాం’ అని స్పష్టంగా ప్రకటించారు.
ఇకపై బాణసంచాకు శాశ్వత నిషేధం
గోవాలోని అర్పోరా నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దరిమిలా ఉత్తర గోవా పరిపాలనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడి నైట్‌క్లబ్‌లు, హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాథమిక దర్యాప్తులో నైట్‌క్లబ్ లోపల నృత్య ప్రదర్శన సందర్భంగా విద్యుత్ బాణసంచా (పైరోటెక్నిక్స్) ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని వెల్లడయ్యింది. ఈ తాజా నిషేధం ద్వారా ఈ రకమైన ప్రమాదకర ప్రదర్శనలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఐదుగురు మేనేజర్లు,సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పారిపోయిన క్లబ్ యజమానుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం!


