2035 నాటికి సాకారం
ఐదు రాకెట్లతో అంతరిక్షంలోకి విడి భాగాలు
2028లో మొదటి మాడ్యూల్ ప్రయోగం
2026 ఫిబ్రవరిలో గగన్‌యాన్ తొలి ప్రయోగం
నాలుగు మానవ రహిత పరీక్షల అనంతరం మానవ సహిత ప్రయోగం
సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు
‘సాక్షి’తో అహ్మదాబాద్ ఎస్‌ఏసీ డైరెక్టర్ నీలేష్ ఎం.దేశాయ్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘సొంత అంతరిక్ష కేంద్రాలు కలిగిన దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం షురూ అవ్వనుంది’ అని ఇస్రోలో భాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ) డైరెక్టర్ నీలేశ్ ఎం.దేశాయ్ తెలిపారు. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఐదు రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి విడి భాగాలు పంపాల్సి ఉందన్నారు.
ఇందులో భాగంగా 2028లో తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి విడి భాగాలన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చి ఇంటిగ్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో రోదసీ యాత్ర చేసే వ్యోమగాములు స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో దిగి చంద్రుడి మీదకు వెళ్తారని చెప్పారు. ఎస్‌ఏసీ పనితీరు గురించి నీలేశ్ ఎం.దేశాయ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
2027లో మానవ సహిత ప్రయోగం
మానవ రహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వేగంగా అడుగులు వేస్తోంది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా తొలుత నాలుగు మానవ రహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో తొలి ప్రయోగం చేపట్టబోతున్నాం. 2026లోనే మరో రెండు, 2027లో చివరి ప్రయోగం పూర్తి చేస్తాం. అదే ఏడాది ఆఖరులో మానవ సహిత ప్రయోగం పూర్తి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా 2022లోనే గగన్‌యాన్ పూర్తి చేయాల్సి ఉంది.
కరోనా, ఇతర సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. గగన్‌యాన్ యాత్రకు వ్యోమగాములుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు కెపె్టన్‌లను ఎంపిక చేశాం. వీరిలో ఒకరైన శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తిరిగి ఎయిర్ ఫోర్స్‌కు వెళ్లగా, ఇద్దరు శిక్షణలో కొనసాగుతున్నారు.
2027లో గగన్‌యాన్‌లో ఎంత మంది వ్యోమగాములు రోదసీ యాత్ర చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు వ్యోమగాములు ఉంటే మంచిదని భావిస్తున్నాం. వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేసి, తిరిగి వచ్చేందుకు వీలుగా వాహక నౌకను తీర్చి దిద్దుతున్నాం. డీఆర్‌డీఏ, ఇతర స్వతంత్ర సంస్థలు నౌకను సర్టిఫై చేస్తాయి.
స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్ల తయారీ
సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇస్రో కార్యకలాపాలకు సెమీ కండక్టర్లు కీలకమైనవి. ఇస్రో అవసరాల కోసం సెమీ కండక్టర్లు బయట నుంచి కొనే పని లేకుండా చేస్తున్నాం. అంతే కాకుండా బయటి సంస్థల అవసరాలకూ సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నాం.
ఎస్‌ఏసీలో దేశంలోనే మొదటి సారిగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్లు తయారు చేస్తున్నాం. ఈ సాంకేతికను వాడుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో ఎంతో చిన్న దేశమైన తైవాన్‌పై ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది.
ఎస్‌ఏసీ ఎంతో విభిన్నం
ఇస్రోలో భాగమైన మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎస్‌ఏసీ ఎంతో విభిన్నమైంది. ఉపగ్రహ పేలోడ్‌లను ప్రజలు, ప్రభుత్వం, సమాజానికి ఉపయోగకరమైన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, దేశ రక్షణ, జాతీయ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంలో ఎస్‌ఏసీకి ప్రత్యేకత ఉంది.
దేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ వ్యవస్థ ద్వారా 15 రోజుల ముందే వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, సమాచారాన్ని ఐఎండీకి చేరవేస్తున్నాం. దీంతో తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి.


