నేడు దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టి20
పటిష్టంగా టీమిండియా
సమం చేయాలని సఫారీలు
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముల్లాన్‌పూర్: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత క్రికెట్ జట్టు... గురువారం దక్షిణాఫ్రికాతో రెండో టి20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలాబలాలు, కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్ కటక్‌లో ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్ బరిలోకి దిగనుంది.
తొలి మ్యాచ్‌లో బంతి కాస్త ఆగి వస్తున్న పిచ్‌పై మన టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధనాధన్ ఆటతో మంచి స్కోరు చేసిన టీమిండియా... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మెరిపించింది. దక్షిణాఫ్రికా టి20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుందంటే... అందులో మన బౌలర్ల ప్రతిభ ఎంతో ఉంది.
ఇప్పుడు అదే జోరు సాగిస్తూ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ భావిస్తుండగా... తొలి మ్యాచ్‌లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్ సమం చేయాలని చూస్తోంది.
టాపార్డర్ రాణించేనా!
పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. ముల్లాన్‌పూర్‌లో మంచి అనుభవం ఉన్న ఈ పంజాబ్ చిన్నోడు సొంతగడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సిక్స్‌ల వర్షం కురిపించిన అభిõÙక్... అదే పరాక్రమం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక భారత వన్డే, టెస్టు రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండగా... మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలకం కానున్నారు. పరిస్థితులను బట్టి గేర్‌లు మార్చే సత్తా వీరిలో పుష్కలం. ఇక గాయం నుంచి కోలుకొని గత మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన పాండ్యా... తన విలువ ఏంటో చాటుకున్నాడు.
అటు బంతితో ఇటు బ్యాట్‌తో విజృంభించిన హార్దిక్ నుంచి మేనేజ్‌మెంట్ ఇలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. శివమ్ దూబే, జితేశ్ శర్మ ఫినిషర్‌ల బాధ్యత నిర్తర్తించనున్నారు. గత మ్యాచ్ ద్వారానే మూడు ఫార్మాట్‌లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
మార్పుల్లేకుండా సఫారీ జట్టు...
స్టార్‌లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కటక్ పిచ్‌పై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని రెండో మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో దుమ్మురేపాలని సఫారీలు భావిస్తున్నారు. డికాక్, మార్క్‌రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్, యాన్సెన్ రూపంలో ఆ జట్టులో ప్రతిభకు కొదవ లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది.
తొలి స్పెల్‌లో అర్ష్ దీప్ కట్టిపడేయడంతో వెనుకంజలో పడ్డ సఫారీలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. దీంతో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘ప్రొటీస్’ కసరత్తులు ప్రారంభించారు. ఇక మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రిస్తుండటంతో... దానికి విరుగుడు కనిపెట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఓపెనర్లు, మార్క్‌రమ్, డికాక్‌లో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే... మిగిలిన వాళ్లు ధనాధన్ షాట్‌లతో స్కోరు వేగం పెంచగల సమర్థులే.
బౌలింగ్‌లో ఎంగిడి, నోర్జే, యాన్సెన్ మరోసారి కీలకం కానున్నారు. తొలి మ్యాచ్‌లో ఎంగిడి భారత టాపార్డర్ పని పట్టాడు. ఊరించే బంతులతో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి అతడిని జాగ్రత్తగా ఎదుర్కోక తప్పదు. యాన్సెన్ వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చాడు. ఎటొచ్చి సఫారీ స్పిన్నర్లనే మనవాళ్లు మరోసారి టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం
ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు... రెండు మహిళల మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. పిచ్ అటు బ్యాటర్లతో పాటు ఇటు పేసర్లకు సహకరించనుంది. మంచు ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు.


