పాక్‌ సీడీఎఫ్‌గా మునీర్‌ ప్రసంగం.. భారత్‌కు హెచ్చరికలు | Pakistan CDF Asim Munir Sensational Comments On India | Sakshi
Sakshi News home page

పాక్‌ సీడీఎఫ్‌గా మునీర్‌ ప్రసంగం.. భారత్‌కు హెచ్చరికలు

Dec 9 2025 7:55 AM | Updated on Dec 9 2025 8:57 AM

Pakistan CDF Asim Munir Sensational Comments On India

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి భారత్‌పై కవ్పింపు చర్యలకు దిగింది. పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా నియమితుడైన తర్వాత తన తొలి ప్రసంగంలోనే ఆసిమ్‌ మునీర్‌.. భారత్‌కు హెచ్చరిక జారీ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్‌పై భారత్‌ ఎలాంటి దాడి చేసినా ప్రతీకార చర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే, పాకిస్తాన్‌ చరిత్రలో పాకిస్తాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా ఆసిమ్‌ మునీర్‌ను షహబాజ్‌ షరీఫ​ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, మునీర్‌ సోమవారం తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా ఆసిమ్‌ మునీర్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో రక్షణ దళాల ప్రధాన కార్యాలయ స్థాపన చారిత్రాత్మకమైనది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏకీకృత చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాయుధ దళాలు యుద్ధానికి కొత్త అవసరాలకు అనుగుణంగా ఉండాలి. పాకిస్తాన్‌పై భారత్‌ ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి పాకిస్తాన్‌ ప్రతీచర్య తీవ్రంగా ఉంటుంది. పాక్ చాలా కఠినంగా స్పందిస్తుంది. కాబట్టి భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ సైన్యం పనితీరుపై మునీర్‌ ప్రశంసలు కురిపించారు. 

మునీర్‌ కోసం 27వ రాజ్యాంగ సవరణ..
ఇదిలా ఉండగా.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్‌ అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పాక్‌.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్‌ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్‌ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్‌ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్‌ పదవిని ఆసిమ్‌ మునీర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్‌గా వ్యవహరించేందుకు సీడీఎఫ్‌ పదవికి ఆసిమ్‌ మునీర్‌ను నియమించాలని పాక్‌ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్‌ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్‌ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్‌ కొనసాగనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement