28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 నాటౌట్
తొలి టి20లో భారత్ ఘన విజయం
101 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు
ముల్లాన్‌పూర్‌లో రేపు రెండో టి20
భారత జట్టులోకి కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా తన వాడిని, స్థాయిని ప్రదర్శించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చి అంచనాలకు తగినట్లుగా చెలరేగుతూ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన వేళ పాండ్యా మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 75 బంతుల్లోనే 74 పరుగులకు కుప్పకూల్చింది.
టీమిండియా పటిష్ట బౌలింగ్‌ను ఎదుర్కోలేక సఫారీలు పూర్తిగా చతికిలపడటంతో ఆట ఏకపక్షంగా మారిపోయింది. దాంతో బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
కటక్: దక్షిణాఫ్రికాతో మొదలైన టి20 సిరీస్‌లో అలవోక విజయాన్ని అందుకొని భారత్ 1–0తో ముందంజ వేసింది. బారాబతి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో భారత్ 101 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఆటతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం ముల్లాన్‌పూర్‌లో జరుగుతుంది.
ఓపెనర్లు విఫలం...
భారత్ స్కోరు ఒకదశలో 17/2, ఆపై 48/3... 14 ఓవర్లు ముగిసేసరికి 104/5... ఈ క్రమాన్ని చూస్తే భారత్ భారీ స్కోరు చేయడం అసాధ్యమనిపించింది. కానీ చివర్లో ఒక్క పాండ్యా బ్యాటింగ్‌తో అంతా మారిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో భారత్ 71 పరుగులు సాధించగలిగింది. భారత ఇన్నింగ్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. పునరాగమనంలో శుబ్‌మన్ గిల్ (4) ఇన్నింగ్స్ మూడు బంతులకే పరిమితం కాగా, ఎన్‌గిడి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సూర్యకుమార్ (12) తర్వాతి బంతికి వెనుదిరిగాడు.
పవర్‌ప్లేలో జట్టు 40 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ (17) జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఈ దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23; 1 సిక్స్) కలిసి కొద్దిసేపు పట్టుదల కనబర్చారు. అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో 30 పరుగులే జోడించగలిగారు.
అయితే పాండ్యా వచ్చీ రాగానే మహరాజ్ ఓవర్లో 2 సిక్సర్లు బాది ఆటకు ఊపు తెచ్చాడు. తర్వాత నోర్జే ఓవర్లోనూ అతను 2 ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో శివమ్ దూబే (11) అవుటైన తర్వాత పాండ్యా దూకుడు కొనసాగింది. సిపామ్లా వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన పాండ్యా...నోర్జే వేసిన 20వ ఓవర్లోనూ 6, 4 కొట్టి 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టపటపా...
ఛేదనలో దక్షిణాఫ్రికా మొదటి నుంచే తడబడింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డికాక్ (0)ను అవుట్ చేసిన అర్‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో స్టబ్స్ (14)ను వెనక్కి పంపాడు. అక్షర్ తన తొలి బంతికే మార్క్‌రమ్ (14) బౌల్డ్ చేయగా, పాండ్యా కూడా తన తొలి బంతికే మిల్లర్ (1) ఆట కట్టించాడు. తర్వాతి ఓవర్లో వరుణ్ బంతిని ఆడలేక ఫెరీరా (5) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా 50/5 వద్ద నిలిచింది.
రెండు సిక్స్‌లు బాదిన యాన్సెన్ (12) కూడా వరుణ్ బంతికే బౌల్డ్ కాగా... మరో ఎండ్‌లో కొన్ని చక్కటి షాట్లతో బ్రెవిస్ పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రెవిస్‌ను చక్కటి బంతితో బుమ్రా డగౌట్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా ఆశలు కోల్పోయింది.
101
అంతర్జాతీయ టి20ల్లో బుమ్రా వికెట్ల సంఖ్య. అర్ష్ దీప్ సింగ్ (107) తర్వాత వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
100 అంతర్జాతీయ టి20ల్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ల సంఖ్య. కోహ్లి, సూర్యకుమార్, రోహిత్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) యాన్సెన్ (బి) సిపామ్లా 17; గిల్ (సి) యాన్సెన్ (బి) ఎన్‌గిడి 4; సూర్యకుమార్ (సి) మార్క్‌రమ్ (బి) ఎన్‌గిడి 12; తిలక్ (సి) యాన్సెన్ (బి) ఎన్‌గిడి 26; అక్షర్ (సి) ఫెరీరా (బి) సిపామ్లా 23; పాండ్యా (నాటౌట్) 59; దూబే (బి) ఫెరీరా 11; జితేశ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–17, 3–48, 4–78, 5–104, 6–137.
బౌలింగ్: ఎన్‌గిడి 4–0–31–3, యాన్సెన్ 4–0–23–0, సిపామ్లా 4–0–38–2, నోర్జే 4–0–41–0, మహరాజ్ 2–0–25–0, ఫెరీరా 2–0–13–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) అభిషేక్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్‌రమ్ (బి) అక్షర్ 14; స్టబ్బ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 14; బ్రెవిస్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 22; మిల్లర్ (సి) జితేశ్ (బి) పాండ్యా 1; ఫెరీరా (సి) జితేశ్ (బి) వరుణ్ 5; యాన్సెన్ (బి) వరుణ్ 12; మహరాజ్ (సి) జితేశ్ (బి) బుమ్రా 0; నోర్జే (బి) అక్షర్ 1; సిపామ్లా (సి) అభిషేక్ (బి) దూబే 2; ఎన్‌గిడి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 74.
వికెట్ల పతనం: 1–0, 2–16, 3–40, 4–45, 5–50, 6–68, 7–68, 8–70, 9–72, 10–74. బౌలింగ్: అర్ష్ దీప్ 2–0–14–2, బుమ్రా 3–0–17–2, వరుణ్ 3–1–19–2, అక్షర్ 2–0–7–2, పాండ్యా 2–0–16–1, దూబే 0.3–0–1–1.


