న్యూఢిల్లీ: తన జీవితంలో క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా స్మృతి మాట్లాడుతూ ... ‘నేను క్రికెట్ కంటే ఎక్కువ ప్రేమించే విషయం ప్రపంచంలో మరొకటి లేదు.
భారత జెర్సీ వేసుకోవడం కన్నా పెద్ద గౌరవం ఏం ఉంటుంది. అది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. సమస్యలన్నీ పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి సారించేందుకు ఉపకరిస్తుంది. చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి నా మదిలో ఎప్పుడూ ప్రపంచ చాంపియన్‌గా ఎదగాలనే కోరిక ఉండేది. అది ఇటీవల నిజమైంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ నెగ్గడం మా జీవితంలో అతిగొప్ప క్షణం. ట్రోఫీ హస్తగతం అయిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు’ అని స్మృతి వివరించింది.


