ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్‌షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్‌ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
భౌగోళిక ఒత్తిడులు
2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్‌లతో సహా అనేక మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్‌షిప్ డీల్స్‌లో 15-20% తగ్గుదల కనిపించింది.
దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్‌ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్‌లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్‌కు దూరం చేసింది.
రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లు
ఐపీఎల్ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్‌షిప్‌లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం లీగ్‌కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్‌కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.
రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్‌షిప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్‌కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.
ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్‌లు (ఆటో, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్‌ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్‌లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.
బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌లో పోటీ లోపం
కార్పొరేట్ ప్రభావం ఐపీఎల్ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్‌లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్‌లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్‌ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్ మొత్తం విలువను దెబ్బతీసింది.
ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యూయర్‌షిప్‌ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.
పునరుద్ధరణకు మార్గాలు
రియల్-మనీ గేమింగ్‌పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్‌కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్‌షిప్‌లను ఆకర్షించాలి.
ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్‌తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్‌ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.
భవిష్యత్ సీజన్‌ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ


