ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి | Indian T20 teams batting prowess in the last two years | Sakshi
Sakshi News home page

ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి

Mar 9 2026 4:28 AM | Updated on Mar 9 2026 8:13 AM

Indian T20 teams batting prowess in the last two years

భయం లేదు, బెదురు లేదు... మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన మాత్రమే ఉంది. ఒక వికెట్‌ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకడు పోతే మరొకడు అన్నట్లుగా అవుటైన బ్యాటర్‌ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయేందుకు సిద్ధం... గత రెండేళ్ళలో భారత టి20 జట్టు బ్యాటింగ్‌ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టి20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. 

ఐపీఎల్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్‌గా ప్రతీ మ్యాచ్‌కు కొత్త రికార్డు నెలకొల్పుతూ వచ్చిన అభిషేక్‌ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలు సులువు చేస్తే, మిడిలార్డర్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్‌ జట్టులో తిలక్‌ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీమ్‌కు దూరమై తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్‌తో అతను వరల్డ్‌ కప్‌లోకి అడుగు పెట్టాడు. 

టోర్నీలో కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్‌తోపాటు సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్‌–3లో అభిషేక్, కిషన్, తిలక్‌లవంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో ప్రత్యర్థులు ఆఫ్‌స్పిన్నర్‌ను ప్రయోగించి జట్టును దెబ్బ తీస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన యాజమాన్యం సామ్సన్‌ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే... ఆ తర్వాత టీమ్‌ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. 

జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్‌పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లండ్‌పై 253, న్యూజిలాండ్‌పై 255... ఇలా పరుగుల వరద పారింది. ఒక్క అమెరికాపై మ్యాచ్‌ మినహా బ్యాటర్‌గా సూర్యకుమార్‌ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ సహచరుల ప్రదర్శనలతో భారత్‌ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్‌లో భారీ హిట్టింగ్‌తో పరుగులు రాబట్టిన అతను బౌలర్‌గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లలో కూడా సత్తా చూపించాడు. 

ఇంగ్లండ్‌పై సెమీస్‌లో అతను వేసిన 19వ ఓవర్‌ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విజయంలో శివమ్‌ దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్‌ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్‌లో బుమ్రా ఒంటి చేత్తో జట్టుతో నడిపించిన తీరు అతను ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ఎందుకో చెబుతుంది. 2024 టోర్నీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదునును చూపించాడు. 

ఏడుకంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం కోలుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్‌. తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో అర్‌‡్షదీప్‌ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి టోర్నీ ద్వితీయార్ధంతో కొంత తడబడినా... ఓవరాల్‌గా అతని స్పిన్‌ ప్రభావం బాగానే కనిపించింది. టీమ్‌ కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్‌ ఒకే ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా, రింకూ సింగ్‌కు కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 

2024 ఆరంభం నుంచి భారత జట్టు ఆరుసార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత 50 మ్యాచ్‌లలో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మినహా మిగతా ఎనిమిది మ్యాచ్‌లలో టీమిండియా అసలు స్థాయిని ప్రదర్శించాయి. గత రెండేళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్‌లలో విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో వరల్డ్‌ కప్‌ను అందించాయి.   –సాక్షి క్రీడా విభాగం  

 

 

సక్సెస్‌ఫుల్‌ కోచ్‌ 
భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్‌స్వీప్‌నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడటం హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్‌గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్‌ దక్కలేదు. 

అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి మాత్రం గంభీర్‌ను విజయవంతమైన కోచ్‌గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్‌గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. 

కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్‌కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్‌ కప్‌లను గెలిపించిన కెప్టెన్‌ గంభీర్‌ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్‌ కప్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్‌కప్‌ గెలిచిన గంభీర్‌ ఇప్పుడు కోచ్‌గా తన ఖాతాలో మరో ప్రపంచకప్‌ జమ చేసుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement