ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ | indigo CEO apology reassurance and operational detail full details | Sakshi
Sakshi News home page

ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

Dec 9 2025 5:42 PM | Updated on Dec 9 2025 6:06 PM

indigo CEO apology reassurance and operational detail full details

దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం (డిసెంబర్ 9, 2025) ఒక వీడియో సందేశం ద్వారా ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. విమానాల రద్దు, జాప్యం కారణంగా కస్టమర్‌లకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, ఇండిగో తన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించిందని చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికుల్లో విశ్వసనీయతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

వ్యక్తిగత క్షమాపణ

సీఈఓ తన సందేశంలో ‘ప్రియమైన కస్టమర్‌లు.. మేము మీకు అసౌకర్యాన్ని, నిరాశను కలిగించామని మాకు తెలుసు. మీలో చాలా మంది ముఖ్యమైన క్షణాలను కోల్పోయారని తెలుసు. కుటుంబ సభ్యులను కలుసుకునేవారు, వ్యాపార సమావేశాలు, సెలవులు.. ఇలా చాలా మందికి తమ ప్రయాణాల్లో అంతరాయం కలిగింది. మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అంగీకరిస్తున్నాం’ అని అన్నారు.

కార్యకలాపాలు పునరుద్ధరణ

గత కొన్ని రోజుల పాటు కొనసాగిన గందరగోళం తర్వాత నెట్‌వర్క్ పునరుద్ధరణ కోసం ఇండిగో తీసుకున్న చర్యలను సీఈఓ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న అతిపెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

విమాన సర్వీసుల పునరుద్ధరణ క్రమం

  • డిసెంబర్ 5: 700 విమానాలు

  • డిసెంబర్ 6: 1,500 విమానాలు

  • డిసెంబర్ 7: 1,650 విమానాలు

  • డిసెంబర్ 8: 1,800 విమానాలు

  • డిసెంబర్ 9: 1,800 విమానాలు, పూర్తి నెట్‌వర్క్ పునరుద్ధరణ

‘ఈ రోజు డిసెంబర్ 9 నాటికి మా కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని నేను నిర్ధారించగలను. మేము మా నెట్‌వర్క్‌లోని మొత్తం 138 గమ్యస్థానాలకు తిరిగి సేవలు అందిస్తున్నాం’ అని ఎల్బర్స్ ప్రకటించారు.

ప్రయాణికులకు తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇండిగో తీసుకున్న చర్యలను కూడా ఎల్బర్స్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు లేదా ఇంటికి సురక్షితంగా చేర్చడం తొలి ప్రాధాన్యతగా తెలిపారు. లక్షల మంది కస్టమర్‌లకు ఇప్పటికే పూర్తి రిఫండ్‌లు జారీ అయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విమానాశ్రయాల్లో నిలిచిపోయిన చాలా బ్యాగ్‌లను ప్రయాణికుల ఇళ్లకు పంపినట్లు పేర్కొన్నారు.

భవిష్యత్తుపై భరోసా

ఈ సంక్షోభంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని సీఈఓ తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో ఎదురైన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు. ‘ఇటువంటి అంతరాయాలు మళ్లీ జరగకుండా చూసుకోవడానికి మేము కొత్త రక్షణలను అమలు చేస్తున్నాం. మాపై నమ్మకాన్ని ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

ఇదీ చదవండి: అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement