అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు | Jai Anmol Ambani son of Anil Ambani been named by the CBI Rs 228 cr fraud | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

Dec 9 2025 5:01 PM | Updated on Dec 9 2025 6:02 PM

Jai Anmol Ambani son of Anil Ambani been named by the CBI Rs 228 cr fraud

రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన రూ.228.06 కోట్ల బ్యాంకింగ్ మోసం కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ కేసులో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, దాని మాజీ సీఈవో, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాల్కర్‌తో పాటు వివరాలు తెలియని కొందరు ప్రభుత్వోద్యోగుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన కారణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228.06 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జై అన్మోల్ అంబానీ, రవీంద్ర సుధాల్కర్ తదితరులు రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించడంలో అవకతవకలకు పాల్పడి ఆర్థిక నష్టాన్ని కలిగించే చర్యలకు పాల్పడ్డారని సీబీఐకి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశారు. మోసం, పదవి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కింద ఏజెన్సీ కేసు నమోదు చేసింది.

మోసం జరిగిందిలా..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అనూప్ వినాయక్ తరాలే దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆర్థిక సహాయం కోరుతూ ముంబైలోని ఎస్సీఎఫ్ (SCF) శాఖను సంప్రదించింది. దాంతో 2015-2019 మధ్య యూనియన్ బ్యాంక్ ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.450 కోట్ల టర్మ్ లోన్లను మంజూరు చేసింది. దీనితో పాటు కంపెనీ అందించే రూ.100 కోట్ల విలువైన ప్రైవేటుగా ఉంచిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు కూడా బ్యాంకు సబ్‌స్క్రైబ్‌ చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో తిరిగి చెల్లించడం, సెక్యూరిటీలు, ఫైనాన్షియల్స్‌ను సరిగ్గా బహిర్గతం చేయాల్సిన షరతులపై ఈ రుణాలు మంజూరు చేసింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా నమోదు చేయబడి, సెప్టెంబర్ 2017లో నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయింది.

రుణ నిధులను జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాల్కర్ సహా మాజీ డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాల్లోకి మళ్లించారని బ్యాంక్ ఆరోపించింది. 30 సెప్టెంబర్ 2019న డెట్‌ అకౌంట్‌ నిలిపేశారు. తదుపరి పరిశీలన తరువాత బ్యాంక్ 10 అక్టోబర్ 2024న ఖాతాను ‘ఫ్రాడ్‌’గా ప్రకటించింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది.

ఆడిట్‌లో బట్టబయలు

ఏప్రిల్ 2016 నుంచి జూన్ 2019 వరకు గ్రాంట్ తోర్న్‌టన్‌ ఇండియా ఎల్ఎల్‌పీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో తీవ్ర ఒడిదొడుకులు బయటపడ్డాయి. రుణం తీసుకున్న నిధులు ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు ఆడిట్‌లో కనుగొన్నారు. కంపెనీ జనరల్ పర్పస్ కార్పొరేట్ రుణాల్లో దాదాపు 86 శాతం, అంటే రూ.12,573.06 కోట్లు పరోక్షంగా అనుసంధానించిన సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆడిట్ రిపోర్ట్‌ ఇచ్చారు. ఇందులో సర్క్యులర్ లావాదేవీలను కూడా నివేదించారు.

ఈ నేపథ్యంలో నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), 13(1)(డీ), సవరించిన పీసీ చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తును న్యూఢిల్లీలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రోషన్ లాల్‌కు అప్పగించారు.

ఇదీ చదవండి: అంతరిక్షంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement