క్యాన్సర్‌ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్‌ క్రికెటర్‌ | Nic Maddinson fights cancer to rejoin cricket, signs with Sydney Thunder for BBL 25-26 | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్‌ క్రికెటర్‌

Dec 9 2025 4:58 PM | Updated on Dec 9 2025 6:02 PM

Nic Maddinson fights cancer to rejoin cricket, signs with Sydney Thunder for BBL 25-26

ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ  మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్‌కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. 

ప్రస్తుతం అతను క్యాన్సర్‌ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్‌ 14) బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 కోసం సిడ్నీ థండర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్‌ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్‌తో బీబీఎల్‌ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. 

థండర్‌తో ఒప్పందం అనంతరం మాడిన్సన్‌ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్‌లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్‌ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.

మాడిన్సన్‌ థండర్‌తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో మాడిన్సన్‌ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్‌ (7 సీజన్లు), మెల్‌బోర్న్‌ స్టార్స్‌ (3), మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్‌ అతని నాలుగో జట్టు. 

ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మాడిన్సన్‌ ఆసీస్‌ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్‌లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్‌ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్‌లు ఆడాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement