వర్గీకరణ మ్యాచ్‌లో ఉరుగ్వేపై విజయం
మూడు షాట్‌లను అడ్డుకున్న గోల్‌కీపర్ నిధి
9–10 స్థానాల కోసం స్పెయిన్‌తో పోరు
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు 9–10 స్థానాల కోసం పోటీపడనుంది. నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైన జ్యోతి సింగ్ బృందం వర్గీకరణ మ్యాచ్‌ల్లో రాణిస్తోంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో నెగ్గిన టీమిండియా... ఉరుగ్వేతో జరిగిన మరో వర్గీకరణ మ్యాచ్‌లో మాత్రం ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయంలోనే గెలవాల్సిన భారత జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకొని ఆటను ‘షూటౌట్’ వరకు తీసుకెళ్లింది.
మ్యాచ్ 19వ నిమిషంలో మనీషా చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 60వ నిమిషం వరకు ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి సెకన్లలో ఉరుగ్వేకు గోల్ ఇచ్చింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున పూర్ణిమ యాదవ్, ఇషిక, కనిక సివాచ్ వరుసగా మూడు గోల్స్ చేశారు. మరోవైపు ఉరుగ్వే తరఫున తొలి షాట్‌ను అగస్టీనా గోల్‌గా మలచగా... జస్టినా రెండో షాట్‌ను.. సోల్ మార్టినెజ్ తీసుకున్న మూడో షాట్‌ను... సోల్ మిస్కా కొట్టిన నాలుగో షాట్‌ను భారత గోల్‌కీపర్ నిధి అడ్డుకుంది. దాంతో భారత్ నాలుగో షాట్‌ను తీసుకోకుండానే విజయాన్ని ఖరారు చేసుకుంది.
9–10వ స్థానాల కోసం స్పెయిన్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరోవైపు క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్ 8–2తో ఇంగ్లండ్‌పై, బెల్జియం 4–1తో అమెరికాపై, చైనా 5–3తో ఆ్రస్టేలియాపై, అర్జెంటీనా 2–1తో జర్మనీపై గెలుపొంది సెమీఫైనల్లోకి అడుగు పెట్టాయి. సెమీఫైనల్స్‌లో బెల్జియంతో నెదర్లాండ్స్; చైనాతో అర్జెంటీనా పోటీపడతాయి.


