నిరీక్షణ ముగించాలని... | Junior World Cup Hockey Tournament from today | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ముగించాలని...

Nov 28 2025 4:16 AM | Updated on Nov 28 2025 4:16 AM

Junior World Cup Hockey Tournament from today

మూడో ప్రపంచకప్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి భారత్‌ 

నేటి నుంచి జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నీ 

తొలిసారి 24 జట్లతో మెగా ఈవెంట్‌

భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించి 50 ఏళ్లు గడిచాయి. 1975లో ఒక్కసారి మాత్రమే భారత సీనియర్‌ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. ఆ తర్వాత 12 సార్లు ప్రపంచకప్‌ టోర్నీ జరిగినా భారత జట్టు మాత్రం కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. సీనియర్‌ జట్టుతో పోలిస్తే భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తోంది. 

రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. ఒకసారి రన్నరప్‌ ట్రోఫీని అందుకుంది. మూడుసార్లు మూడో స్థానంలో నిలిచింది. చివరిసారి 2016లో సొంతగడ్డపై ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్‌... తొమ్మిదేళ్ల టైటిల్‌ నిరీక్షణకు సొంతగడ్డపై తెర దించాలని, ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో నేడు మొదలయ్యే మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది.   

చెన్నై/మదురై: గత 12 ఏళ్లలో నాలుగోసారి జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ అండర్‌–21 హాకీ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చెన్నై, మదురై నగరాల్లో జరిగే ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. 46 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారి 24 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2009లో 20 జట్లు బరిలోకి దిగగా... ఆ తర్వాత జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో 16 జట్లు పోటీపడ్డాయి. ఈసారి 24 జట్లకు అవకాశం కల్పించారు. 

మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టు అర్హత సాధించినా... భారత్‌తో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్‌ స్థానాన్ని ఒమన్‌ జట్టుతో భర్తీ చేశారు. నేడు జరిగే తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో చిలీ జట్టుతో భారత్‌ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30 నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది. అనంతరం భారత్‌ 29న ఒమన్‌ జట్టుతో, డిసెంబర్‌ 2న స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడుతుంది. 

సీనియర్‌ జట్టు దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న భారత జూనియర్‌ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు ప్రపంచ నంబర్‌వన్, ఏడుసార్లు విజేత జర్మనీ జట్టు నుంచి గట్టిపోటీ ఎదురవనుంది. ఇటీవల మలేసియాలో జరిగిన సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌లో భారత జట్టు రజత పతకం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. అ

యితే పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశమే భారత్‌ను వేధిస్తోంది. జొహోర్‌ కప్‌లో భారత జట్టుకు 53 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... కేవలం ఎనిమిదింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. ‘అవును. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశంపై మేము దృష్టి పెట్టాం. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో రోజుకు 200–300 సార్లు డ్రాగ్‌ ఫ్లిక్‌ చేశాము. 

ఈ సాధన ఫలితాలు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని హెడ్‌ కోచ్‌ శ్రీజేశ్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్‌ సారథ్యంలో భారత జట్టు ఈ మెగా టోర్నీలో ఆడనుంది. ఇప్పటికే భారత సీనియర్‌ జట్టుకు 21 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన డ్రాగ్‌ఫ్లికర్‌ అరిజిత్‌ సింగ్‌ హుండల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.  

ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే... 
గ్రూప్‌ ‘ఎ’: కెనడా, జర్మనీ, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా. 
గ్రూప్‌ ‘బి’: భారత్, చిలీ, ఒమన్, స్విట్జర్లాండ్‌. 
గ్రూప్‌ ‘సి’: జపాన్, న్యూజిలాండ్, చైనా, అర్జెంటీనా. 
గ్రూప్‌ ‘డి’: బెల్జియం, స్పెయిన్, ఈజిప్‌్ట, నమీబియా. 
గ్రూప్‌ ‘ఇ’: ఇంగ్లండ్, మలేసియా, నెదర్లాండ్స్, ఆ్రస్టియా. 
గ్రూప్‌ ‘ఎఫ్‌’: ఆస్ట్రేలియా, కొరియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్‌.

ముందుకెళ్లాలంటే... 
మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. వరుసగా ఐదు రోజులపాటు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మూడు రోజులు ఎనిమిది లీగ్‌ మ్యాచ్‌ల చొప్పున... ఆ తర్వాతి రెండు రోజులు నాలుగు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తారు. లీగ్‌ దశ ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన మేటి రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 16 జట్లు వర్గీకరణ మ్యాచ్‌లు ఆడతాయి.  

5 ఇప్పటి వరకు ఐదు జట్లు మాత్రమే జూనియర్‌ ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచాయి. ఈ జాబితాలో జర్మనీ, భారత్, అర్జెంటీనా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ ఉన్నాయి.

4 జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. గతంలో భారత్‌ 2013, 2016, 2021లలో కూడా ఈ మెగా ఈవెంట్‌కు వేదికగా నిలిచింది.

7 ఇప్పటి వరకు 13 సార్లు జూనియర్‌ ప్రపంచకప్‌ జరిగింది. అత్యధికంగా జర్మనీ జట్టు 7 సార్లు టైటిల్‌ సాధించింది. భారత్‌ (2001, 2016) అర్జెంటీనా (2005, 2021) జట్లు రెండు సార్లు చొప్పున చాంపియన్స్‌గా నిలిచాయి. ఆస్ట్రేలియా (1997), పాకిస్తాన్‌ (1979) ఒక్కోసారి టైటిల్‌ అందుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement