నాలుగో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం
రేపు కెనడాపై గెలిస్తే టైటిల్ పోరుకు అర్హత
ఇపో (మలేసియా): అందివచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నీలో ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో సంజయ్ సారథ్యంలోని టీమిండియా 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది మూడో విజయం. భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (4వ నిమిషంలో), సంజయ్ (32వ నిమిషంలో), సెల్వం కార్తీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
న్యూజిలాండ్ జట్టుకు జార్జి బాకెర్ (42వ, 48వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెల్జియం జట్టు పది పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్; బెల్జియంతో న్యూజిలాండ్; మలేసియాతో దక్షిణ కొరియా ఆడతాయి. కెనడాపై భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుకుంటుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను బెల్జియం ‘డ్రా’ చేసుకున్నా భారత్‌తో కలిసి ఫైనల్లోకి అడుగు పెడుతుంది. బెల్జియంపై 13 గోల్స్ తేడాతో గెలిస్తేనే న్యూజిలాండ్‌కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.


