టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా టైటిల్ నిరీక్షణకు తెర దించింది. మూడేళ్ల తర్వాత తన కెరీర్‌లో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఏఎస్‌బీ క్లాసిక్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్ స్వితోలినా చాంపియన్‌గా అవతరించింది.
న్యూజిలాండ్ వేదికగా ఫైనల్లో స్వితోలినా 6–3, 7–6 (10/8)తో ఏడో సీడ్ వాంగ్ జిన్‌యు (చైనా)పై గెలిచింది. ఓవరాల్‌గా స్వితోలినా కెరీర్‌లో ఇది 19వ సింగిల్స్ టైటిల్. ఈ ఉక్రెయిన్ ప్లేయర్ చివరిసారి 2023లో స్ట్రాస్‌బర్గ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2024లో ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో స్వితోలినా ఫైనల్ చేరినా తుది పోరులో కోకో గాఫ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
గత ఏడాది సెప్టెంబరులో మానసిక సమస్యలతో ఇబ్బందిపడిన స్వితోలినా ఆటకు విరామం ఇచ్చింది. మూడు నెలల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన ఆమె ట్రోఫీని కూడా ముద్దాడింది. టైటిల్ నెగ్గిన స్వితోలినాకు 37,390 డాలర్ల (రూ. 33 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుందంటూ సోషల్ మీడియా వేదికగా స్వితోలినా ఉద్వేగానికి లోనైంది.
మెద్వెదెవ్ టైటిల్ నంబర్ 22
గత ఏడాది ఒక్క టైటిల్‌తో సరిపెట్టుకున్న రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ సీజన్‌లో మాత్రం ఆరంభంలోనే టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్ మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. బ్రాండన్ నకషిమా (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 6–2, 7–6 (7/1)తో విజయం సాధించాడు.
95 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
మెద్వెదెవ్ కెరీర్‌లో ఇది 22వ సింగిల్స్ టైటిల్‌కాగా... 22 టైటిల్స్ వేర్వేరు కావడం విశేషం. ఒకసారి గెలిచిన టైటిల్‌ను అతను రెండోసారి సాధించలేదు. బ్రిస్బేన్ ఓపెన్ విజేత హోదాలో మెద్వెదెవ్‌కు 1,14,060 డాలర్ల (రూ. 1 కోటీ 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
భళా బుబ్లిక్...
హాంకాంగ్: గత ఏడాది నాలుగు టైటిల్స్‌తో అదరగొట్టిన కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బుబ్లిక్ ఈ ఏడాదిలో కూడా శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన హాంకాంగ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బుబ్లిక్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో బుబ్లిక్ 7–6 (7/2), 6–3తో టాప్ సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. బుబ్లిక్ కెరీర్‌లో ఇది తొమ్మిదో ఏటీపీ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.


