బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా.. మార్టా కొస్టుక్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్‌కు చెందిన మార్టా నిరాకరించింది.
ఉక్రెయిన్‌లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.
నేను అసలు పట్టించుకోను
‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్‌హ్యాండ్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.
కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.
నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్‌గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు మార్టా దూరంగా ఉంటోంది.
రూ. 1 కోటీ 93 లక్షలు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్‌ను ఓడించింది.
78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఒక ఏస్ సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది.
ఇక సబలెంకా కెరీర్‌లో ఇది 22వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్ స్టార్‌కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


