ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై వైభవ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.
భారత్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. సౌతాఫ్రికాతో మూడు యూత్ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాడు వైభవ్. అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీకి ముందు అతడు ఫామ్‌లోకి రావడంతో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి
అదే జోరును కొనసాగిస్తూ స్కాట్లాండ్‌తో అండర్-19 వరల్డ్‌కప్-2026 వార్మప్ మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జింబాబ్వే వేదికగా.. స్కాట్లాండ్ జట్టుపై ఈ ఓపెనింగ్ బ్యాటర్ 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం భారత్.. పసికూన స్కాట్లాండ్‌పై 121 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఒకే ఒక్క పరుగు
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే, జింబాబ్వేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం వైభవ్ పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.
ఇంగ్లిష్ పేసర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్‌లో షాట్ ఆడే క్రమంలో థామస్ ర్యూకి క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. పసికూన స్కాట్లాండ్‌పై చితక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తాజాగా పటిష్ట ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తేలిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
భారత్ మెరుగైన స్కోరు
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. వైభవ్‌తో పాటు వేదాంత్ త్రివేది (14), విహాన్ మల్హోత్రా (10) విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 99 బంతుల్లో 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
మిగిలిన వారిలో ఆర్‌ఎస్ అంబరీశ్ 48, కనిష్క్ చౌహాన్ 45 (నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్‌డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్‌కప్ మొదలుకానుంది.
చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు


