ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 100వ విజయం సాధించిన సెర్బియా దిగ్గజం
మూడు ‘గ్రాండ్‌స్లామ్’ టోర్నీల్లో 100 విజయాల మైలురాయి దాటిన ఏకైక టెన్నిస్ ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు
మెల్‌బోర్న్: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
ఓవరాల్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌కిది 100 విజయం కావడం విశేషం. ఫెడరర్ (స్విట్జర్లాండ్–102) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ‘సెంచరీ’ విజయాలు సాధించిన రెండో ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు.
అంతేకాకుండా మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిన ఏకైక ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 101 మ్యాచ్‌ల్లో... వింబుల్డన్‌లో 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికసార్లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసిన జొకోవిచ్... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (81 సార్లు) ఆడిన ప్లేయర్లుగా ఫెడరర్, ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డునూ అందుకున్నాడు.
పెడ్రో మార్టినెజ్‌తో 2 గంటల్లో ముగిసిన మ్యాచ్‌లో జొకోవిచ్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 49 విన్నర్స్ కొట్టిన అతను 21 అనవసర తప్పిదాలు చేశాడు. తన సరీ్వస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ సెర్బియా యోధుడు ప్రత్యర్థి సర్వీస్‌ను
ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
వావ్రింకా బోణీ...
ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో వావ్రింకా 5–7, 6–3, 6–4, 7–6 (7/4)తో లాస్లో జెరె (సెర్బియా)పై గెలిచాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయసు్కడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ రికార్డు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా–40 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ (రష్యా) కూడా గెలుపు బోణీ కొట్టాడు.
తొలి రౌండ్‌లో 11వ సీడ్ మెద్వెదెవ్ 7–5, 6–2, 7–6 (7/2)తో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) 6–2, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 6–4తో మటియా బెలూచి (ఇటలీ)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–3తో మటియో అర్నాల్డి (ఇటలీ)పై, 14వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–2, 6–3, 6–3తో ఫిలిప్ మిసోలిచ్ (ఆస్ట్రియా)పై గెలిచారు.


