మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పెను సంచలనాలు లేకుండానే ప్రారంభమైంది. ఫేవరెట్స్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి శుభారంభం చేశారు.
మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న సబలెంకా తొలి రౌండ్‌లో 6–4, 6–1తో టియాంట్సోవా రకోటొమాంగా (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) ప్రత్యక్షంగా తిలకించారు. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరంభంలో తడబడింది.
వెంటనే తేరుకుని
తొలి మూడు పాయింట్లు కోల్పోవడంతోపాటు తన తొలి సర్వీస్ గేమ్‌ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న రెండుసార్లు (2023, 2024) చాంపియన్, గత ఏడాది రన్నరప్ పదో గేమ్‌లో టియాంట్సోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.
రెండో సెట్‌లో మాత్రం సబలెంకా జోరు పెంచగా... ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన టియాంట్సోవా తేలిపోయింది. 23 విన్నర్స్ కొట్టిన సబలెంకా 20 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పావోలిని 6–1, 6–2తో క్వాలిఫయర్ సస్నోవిచ్ (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–1తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, 28వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–4, 6–1తో మనన్‌చాయ సావంగ్‌కె (థాయ్‌లాండ్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
వీనస్ తొలి రౌండ్‌లోనే అవుట్
మరోవైపు అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్‌తోపాటు 11వ సీడ్ అలెగ్జాండ్రోవా (రష్యా), 20వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), 26వ సీడ్ డయానా యాస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు నెలకొల్పిన 45 ఏళ్ల వీనస్ తీవ్రంగా పోరాడినా తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.
రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ 7–6 (7/5), 3–6, 4–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ జెనెప్ సోన్‌మెజ్ (టర్కీ) 2 గంటల 37 నిమిషాల్లో 7–5, 4–6, 6–4తో అలెగ్జాండ్రోవాపై, 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్) 6–7 (4/7), 7–6 (7/4), 7–6 (10/7)తో మార్టా కొస్టుక్‌పై, ఎలీనా గాబ్రియేలా రుస్ (రొమేనియా) 6–4, 7–5తో యాస్‌ట్రెమ్‌స్కాపై సంచలన విజయాలు నమోదు చేశారు.
అల్‌కరాజ్ శుభారంభం
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ బుబ్లిక్ (కజకిస్తాన్) తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తొలిసారి గెలిచి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న అల్‌కరాజ్ 6–3, 7–6 (7/2), 6–2తో ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు.
చదవండి: ఆమె మనిషి కాదు!


