ఆమె మనిషి కాదు! | India Open: Queen of badminton An Se Young Retains her Delhi throne | Sakshi
Sakshi News home page

ఆమె మనిషి కాదు!

Jan 19 2026 10:47 AM | Updated on Jan 19 2026 11:52 AM

India Open: Queen of badminton An Se Young Retains her Delhi throne

వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రత్యర్థులు ఎవరైనా... తగ్గేదేలా అంటోంది దక్షిణ కొరియా సూపర్‌స్టార్‌ షట్లర్‌ ఆన్‌ సె యంగ్‌. బ్యాడ్మింటన్‌ సీజన్‌లోని రెండో టోర్నమెంట్‌ ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆన్‌ సె యంగ్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది.

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో విజేతగా నిలిచి ఈ ఏడాది ఘనంగా ప్రారంభించిన ఈ ప్రపంచ నంబర్‌వన్‌ అదే జోరును న్యూఢిల్లీలోనూ కొనసాగించింది. తుది పోరులో ఆన్‌ సె యంగ్‌కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి కొరియా స్టార్‌ ధాటికి తేలిపోయింది.

కెరీర్‌లో 22వసారి వాంగ్‌ జి యితో ఆడిన ఆన్‌ సె యంగ్‌ 18వసారి చైనా ప్లేయర్‌ను ఓడించి తన కెరీర్‌లో 36వ సింగిల్స్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. గత ఏడాది చివరి నాలుగు టోర్నీలో విజేతగా నిలిచిన ఆన్‌ సె యంగ్‌ ఈ ఏడాది ఆడిన రెండు టోర్నీలలోనూ టైటిల్‌ సొంతం చేసుకొని ‘సిక్సర్‌’ నమోదు చేసింది.  

న్యూఢిల్లీ: ‘ఆమె మనిషి కాదు... రోబో’ అని ఆన్‌ సె యంగ్‌ గురించి ఆమె ప్రత్యర్థులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత నిలకడగా విజయాలు నమోదు చేస్తున్న ఆన్‌ సె యంగ్‌ కొత్త ఏడాదిలోనూ చెలరేగిపోతోంది. 

ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్‌ టోర్నీలో ఈ టాప్‌ సీడ్‌ ప్లేయర్‌ చాంపియన్‌గా నిలిచింది. గత ఏడాది  టైటిల్‌ సాధించిన ఈ కొరియా సూపర్‌స్టార్‌ ... ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

43 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆన్‌ సె యంగ్‌ 21–13, 21–11తో వాంగ్‌ జి యిపై గెలిచింది. ఆన్‌ సె యంగ్‌కు 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) టైటిల్‌ గెలిచాడు. ఫైనల్లో లిన్‌ చున్‌ యి 21–10, 21–18తో మూడో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.

ప్రైజ్‌మనీ ఎంతంటే?
లిన్‌ చున్‌ యికి 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి. మహిళల డబుల్స్‌లో లియు షెంగ్‌షు –టాన్‌ నింగ్‌ (చైనా) జోడీ టైటిల్‌ దక్కించుకుంది. ఫైనల్లో లియు–టాన్‌ నింగ్‌ 21–11, 21–18తో యుకీ ఫుకుషిమా–సయాకా మత్సుమోతో (జపాన్‌)లపై గెలిచారు.

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో లియాంగ్‌ వెకెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) ద్వయం 17–21, 25–23, 21–16తో హిరోకి మిదోరికావా–క్యోహె యామషిటా (జపాన్‌) జోడీపై నెగ్గి టైటిల్‌ అందుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో డెచాపోల్‌–సుపిసారా (థాయ్‌లాండ్‌) జంట 19–21, 25–23, 21–18తో మథియాస్‌ క్రిస్టియాన్సెన్‌–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్‌) జోడీపై విజయం సాధించి టైటిల్‌ హస్తగతం చేసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement