అమెరికా, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఇప్పటికే పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ మధ్య అబుదాబీలో జరగాల్సిన అనధికారిక వన్డే సిరీస్ రద్దు కాగా.. తాజాగా ఐసీసీ టోర్నీ వాయిదా పడింది.
నేపాల్‌లోని ఖాట్మండు వేదికగా మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ICC Men’s Cricket World Cup League 2లో పలు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఈ మ్యాచ్‌లలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొనాల్సి ఉంది. వాయిదా విషయాన్ని క్రికెట్ నేపాల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
కాగా, ICC Men’s Cricket World Cup League 2 టోర్నీ ద్వారా 2027 వన్డే ప్రపంచకప్‌లో నాలుగు బెర్త్‌లు ఖరారవుతాయి. ఈ క్వాలిఫయర్ టోర్నీ వాయిదా ఆయా జట్ల అర్హత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లతో పాటు యూఎస్‌ఏ, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.
ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో యుద్దం పరోక్షంగానూ క్రికెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్దం కారణంగా గల్ఫ్‌లో దుబాయ్ సహా ప్రధాన విమానాశ్రయాలన్నీ మూసివేయడంతో టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొన్న పలు జట్లు స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోయాయి.
మరోపక్క సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా అక్కడే ఇరుక్కుపోయింది. ఈ విషయాలను ఐసీసీ దగ్గరుండి పరిశీలిస్తూ.. ఆయా జట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తుంది.


