డిఫెండింగ్‌ చాంపియన్‌కు భారీ షాక్‌! | Jessica Pegula dumps defending champion Madison Keys out of Australian Open | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ చాంపియన్‌కు భారీ షాక్‌!

Jan 27 2026 10:05 AM | Updated on Jan 27 2026 10:22 AM

Jessica Pegula dumps defending champion Madison Keys out of Australian Open

మెల్‌బోర్న్‌: అమెరికా స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో అమెకు సహచర క్రీడాకారిణి జెస్సికా పెగులా షాక్‌ ఇచ్చింది. ఈ విభాగంలో టాప్‌ సీడ్, పోలాండ్‌ స్టార్‌ స్వియాటెక్, నాలుగో సీడ్‌ అనిసిమోవ, ఐదో సీడ్‌ రిబాకినా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. అతనితో పాటు ఐదో సీడ్‌ ముసెట్టి, ఎనిమిదో సీడ్‌ షెల్టన్‌లు కూడా క్వార్టర్స్‌ చేరాడు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ పెగులా (అమెరికా) 6–3, 6–4తో తన దేశానికే చెందిన డిఫెండింగ్‌ చాంపియన్, తొమ్మిదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ను కంగుతినిపించింది.

స్వియాటెక్‌ గెలుపు
గత సెమీఫైనలిస్ట్‌ ఇగా స్వియాటెక్‌ 6–0, 6–3తో స్థానిక క్వాలిఫయర్‌ మాడిసన్‌ ఇన్‌గ్లిస్‌ (ఆసీస్‌)పై అలవోక విజయం సాధించగా, 2023 రన్నరప్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) 6–1, 6–3తో ఎలీస్‌ మెర్టన్స్‌ (బెల్జియం)ను ఓడించింది. 

అమెరికాకు చెందిన నాలుగో సీడ్‌ అమెండా అనిసిమోవ 7–6 (7/4), 6–4,తో జిన్యూ వాంగ్‌ (చైనా)పై గెలిచి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అమెండా గతంలో మూడుసార్లు (2019, 2022, 2024) ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది.  

సినెర్‌ జోరు 
పురుషుల సింగిల్స్‌లో యానిక్‌ సినెర్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ‘హ్యాట్రిక్‌’ లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గత రెండేళ్లు టైటిల్‌ సాధించిన ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ఇటాలియన్‌ స్టార్‌ 6–1, 6–3, 7–6 (7/2)తో తన దేశానికే చెందిన 22వ సీడ్‌ ల్యూసియానో డర్డెరిపై గెలుపొందాడు.

గతేడాది సెమీఫైనలిస్ట్, ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) 3–6, 6–4, 6–3, 6–4తో నార్వేకు చెందిన 12వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఐదో సీడ్‌ లారెంజో ముసెట్టి (ఇటలీ) 6–2, 7–5, 6–4తో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)ను ఓడించి తొలిసారి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.

పురుషుల డబుల్స్‌లో భారత డబుల్స్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. స్వీడెన్‌కు చెందిన ఆండ్రీ గొరాన్సన్‌తో కలిసి పదో సీడ్‌గా బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ మూడో రౌండ్లో 6–7 (7/9), 3–6తో బ్రెజిల్‌ ద్వయం ఒర్లాండో లుజ్‌–రాఫెల్‌ మాటొస్‌ చేతిలో ఓడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement