టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్‌పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.
ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!
అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.
సెక్యూరిటీ టీమ్ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ హెడ్ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్ ఒక రకంగా నిందలు వేశాడు.
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐసీసీ
అయితే, నజ్రుల్ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడకూడదని కాదు. భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.
భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించాయి.
పచ్చి అబద్ధం
ఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్‌లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్ నజ్రుల్ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్ సెలక్షన్ వల్ల బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
కాగా బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.


