సహజ యామలపల్లి, ప్రార్థన, రియా భాటియా, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ విశాల్ ఉప్పల్, అంకిత రైనా, శ్రీవల్లి రష్మిక
నేటి నుంచి బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లే ఆఫ్ టోర్నీ
స్లొవేనియా, నెదర్లాండ్స్ జట్లతో ఆడనున్న భారత్
సహజ, శ్రీవల్లి రష్మికలపైనే ఆశలు
గ్రూప్ ‘జి’ విజేత జట్టు వచ్చే ఏడాది క్వాలిఫయర్స్‌కు అర్హత
బెంగళూరు: కొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల టెన్నిస్ జట్టు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లే ఆఫ్ టోలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ మెగా టోర్నీ భారత్ వేదికగా తొలిసారి జరగనుంది. గ్రూప్ ‘జి’లో ఆతిథ్య భారత్‌తోపాటు స్లొవేనియా, నెదర్లాండ్స్ జట్లున్నాయి. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ ‘జి’ విజేత జట్టు వచ్చే ఏడాది బిల్లీ జీన్ కింగ్ కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. మిగతా రెండు జట్లు రీజినల్ గ్రూప్–1 టోర్నీలో ఆడతాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణేలో జరిగిన రీజినల్ గ్రూప్–1లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి 2021 తర్వాత రెండోసారి ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత పొందింది. అయితే లాత్వియాతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1–3తో ఓడిపోయింది. శుక్రవారం తొలి రోజు స్లొవేనియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత శనివారం స్లొవేనియాతో... ఆదివారం నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. ర్యాంకింగ్ పరంగా స్లొవేనియా, నెదర్లాండ్స్ జట్లకంటే వెనుకబడి ఉన్నప్పటికీ సొంతగడ్డపై భారత్ నుంచి అద్భుతాన్ని ఆశించవచ్చు.
భారత ఆశలన్నీ సింగిల్స్ ప్లేయర్లు, హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మికలపైనే ఆధారపడి ఉన్నాయి. ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో రషి్మక విశేషంగా రాణించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌కు ప్లే ఆఫ్ బెర్త్ దక్కడంలో తనవంతు పాత్రను పోషించింది. మరోవైపు సహజ యామలపల్లి కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోంది. ఇటీవల మెక్సికోలో జరిగిన డబ్ల్యూటీఏ–125 టోర్నీలో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, అమెరికా స్టార్ స్లోన్ స్టీఫెన్స్‌ను సహజ ఓడించి సంచలనం సృష్టించింది.
అదే తరహా ప్రదర్శనను సహజ సొంతగడ్డపై పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. సహజ, రషి్మకలతోపాటు అంకిత రైనా, రియా భాటియా, ప్రార్థన తొంబారే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. సింగిల్స్‌లో సహజ, రషి్మక బరిలోకి దిగనుండగా... డబుల్స్‌లో అంకిత రైనా, రియా భాటియా, ప్రార్థన ఆడనున్నారు. ‘మేము చరిత్ర సృష్టించాలనే అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు.
మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలనే లక్ష్యంతో ఉన్నాం. మేము ఆడాల్సిన రెండు జట్లు పటిష్టమైనవి. వారిపై ఎలా నెగ్గాలనే దానిపై ప్రణాళికలు రచించాం. వాటిని మైదానంలో అమలు చేయాలి. మా నియంత్రణలో ఉన్న వాటిపై ఆలోచిస్తాం. మా పరిధిలో లేని వాటి గురించి ఆలోచించదల్చుకోలేదు’ అని భారత మహిళల జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్ విశాల్ ఉప్పల్ తెలిపాడు.


