డబుల్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్న ట్రవిస్‌ హెడ్‌ | Ashes 2025-26, Travis Head Dominates Again With Century And Racing Toward Double Hundred, Video Went Viral | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్న ట్రవిస్‌ హెడ్‌

Jan 6 2026 7:21 AM | Updated on Jan 6 2026 10:54 AM

Head's 12th Ton continues Australia's push in Sydney

యాషెస్‌ సిరీస్‌ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ మరో శతకం బాదాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మొదటి, మూడు టెస్ట్‌ల్లో సెంచరీలు చేసిన అతడు.. తాజాగా ఐదో టెస్ట్‌లోనూ శతక్కొట్టాడు. ఈ శతకాన్ని హెడ్‌ మెరుపు వేగంతో (105 బంతుల్లో) పూర్తి చేశాడు.

సెంచరీతో ఆగిపోని హెడ్‌ మరో 47 బంతుల్లోనే 150 పరుగుల మార్కును కూడా తాకి డబుల్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఫలితంగా ఆసీస్‌ ఐదో టెస్ట్‌లో పైచేయి సాధించే దిశగా వెళ్తుంది. మూడో రోజు తొలి సెషన్‌ సమయానికి ఆసీస్‌ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 268 పరుగులుగా ఉంది. హెడ్‌ 155, స్టీవ్‌ స్మిత్‌ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 116 పరుగులు మత్రమే వెనుకపడి ఉంది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లలో జేక్‌ వెదరాల్డ్‌ 21, లబూషేన్‌ 48, నైట్‌ వాచ్‌మన్‌ మైఖేల్‌ నెసర్‌ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 2, బ్రైడన్‌ కార్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. జో రూట్‌ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్‌ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్‌‌ బౌలర్లలో నెసర్‌ 4, స్టార్క్‌, బోలాండ్‌ తలో 2, గ్రీన్‌, లబూషేన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

600 పరుగులకు చేరువలో
ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న హెడ్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 599 పరుగులు చేసి, పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల తరఫున 500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌ హెడ్‌ ఒక్కడే. ఐదో టెస్ట్‌ మూడో రోజు లంచ్‌ సమయానికి హెడ్‌ 162 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement