క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన
ఆఖరి టి20లో 15 పరుగులతో ఓడిన లంక
హర్మన్‌ప్రీత్ అర్ధ సెంచరీ
అరుంధతి మెరుపులు
ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత్ 5–0తో వైట్‌వాష్ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.
తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్‌ను 5–0తో హర్మన్ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసింది.
హైదరాబాదీ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
ఆదుకున్న హర్మన్
మొదట బ్యాటింగ్‌కు దిగగానే భారత్ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్ డియోల్ (13), రిచా ఘోష్ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది.
అమన్‌జోత్ (21)తో కలిసి వికెట్ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్ స్కోరు 100కు చేరింది. హర్మన్ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్‌ను రష్మిక అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగింది.
హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ
లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్‌ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్‌ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది.
నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
తమిళనాడుకు చెందిన గుణాలన్ కమలిని ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున టి20 మ్యాచ్‌లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.
సీనియర్ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్‌స్కోరర్ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్ రాణాను తప్పించింది.
20వ ఓవర్లో 20
హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ డెత్ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్ రాణా పరుగు చేయలేదు. వైడ్ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.
152 భారత బౌలర్ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్ (బి) రష్మిక 13; హర్మన్‌ప్రీత్ (బి) కవీశా 68; రిచా ఘోష్ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్‌జోత్ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్) 27; స్నేహ్ రాణా (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2.
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్‌జోత్ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 8; కౌశిని రనౌట్ 1; రష్మిక (నాటౌట్) 14; మదర (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్‌జోత్ 2–0–17–1.


