సూర్యకుమార్ సారథ్యంలో బరిలోకి
ఇషాన్ కిషన్, రింకూ సింగ్ పునరాగమనం
జితేశ్‌పై వేటు...వైస్ కెప్టెన్‌గా అక్షర్
టి20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన
టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లు అనూహ్య షాక్ ఇచ్చారు. వరుసగా విఫలమవుతున్నా, అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతున్నా పదే పదే తాము అండగా నిలిచిన శుబ్‌మన్ గిల్‌పై సరిగ్గా ప్రపంచ కప్‌కు ముందు వేటు వేశారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ అయిన ఆటగాడికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు.
ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ప్రదర్శనను గుర్తిస్తూ జట్టులోకి తీసుకున్న సెలక్టర్లు, ఇప్పటికే రెండో కీపర్‌గా నిలదొక్కుకున్న జితేశ్‌పై వేటు వేశారు. ఫలితంగా ఫినిషర్‌గా మరోసారి రింకూ సింగ్‌కే అవకాశం దక్కింది. 2024లో విజేతగా నిలిచిన జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు ఈ సారి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంతగడ్డపై టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడు. 15 మంది సభ్యుల ఈ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. బ్యాటింగ్ ఫామ్‌తో సంబంధం లేకుండా కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్‌పైనే నమ్మకం ఉంచగా, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో 2026 వరల్డ్ కప్ జరుగుతుంది.
రెండేళ్ల తర్వాత...
ఇషాన్ కిషన్ 2023 నవంబర్‌లో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడు. ప్రదర్శనపరంగా కాకుండా నాటి కోచ్ ద్రవిడ్ దృష్టిలో క్రమశిక్షణ తప్పిన కుర్రాడిగా ముద్ర పడింది. దేశవాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంతో బీసీసీఐ హెచ్చరికకు కూడా గురయ్యాడు.
ఇక భారత జట్టులో అటు పంత్, ఇటు సామ్సన్‌లతో పాటు జురేల్, జితేశ్ కూడా నిలదొక్కుకోవడంతో ప్రాధాన్యతపరంగా కిషన్ వెనుకబడిపోయాడు. దాంతో అతను తనను తాను మార్చుకున్నాడు. వరుసగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫిట్‌గా మారి నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. క్రమశిక్షణ విషయంలో కూడా మరో ఫిర్యాదు రాకుండా జాగ్రత్తపడ్డాడు.
చివరకు ఇటీవలి ముస్తాక్ అలీ ట్రోఫీతో ఒక్కసారిగా పైకెగిసాడు. ఏకంగా 517 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్‌గా జార్ఖండ్‌ను చాంపియన్‌గా నిలపడంతో అందరి దృష్టీ పడేలా చేశాడు. ఫలితంగా అతను కూడా ఊహించని విధంగా వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం లభించింది. ప్రత్యామ్నాయ ఓపెనర్ కం కీపర్‌గా అతను సిద్ధమయ్యాడు.
ఆ ఇద్దరు ఇలా...
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రింకూ సింగ్‌పై వేటు పడినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అతని గురించి చెప్పేందుకు వైఫల్యాలేమీ లేవు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లో అతను బాగానే ఆడాడు. కానీ వికెట్ కీపర్‌గా జితేశ్‌ను ఎంపిక చేస్తూ సెలక్టర్లు అతడిని ఫినిషర్ పాత్రను కూడా ఇచ్చారు. దాంతో రింకూకు అవకాశం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు గిల్‌పై వేటు సామ్సన్‌కు ఓపెనింగ్ స్థానం ఖాయం చేశారు. ఫలితంగా ఫినిషర్‌గా జితేశ్‌కంటే రింకూ మెరుగైన ఆటగాడని అగార్కర్ బృందం భావించింది. దాంతో జట్టులోకి మళ్లీ పిలుపు రాగా...పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జితేశ్‌ను పక్కన పెట్టక తప్పలేదు.
7 మార్పులు...
2024 చాంపియన్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఈ సారి కనిపించడం లేదు. రోహిత్, కోహ్లి, జడేజా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించగా...జైస్వాల్, పంత్, చహల్, సిరాజ్ తమ స్థానాలు కోల్పోయారు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఇదే తొలి టి20 వరల్డ్ కప్ కానుంది.
‘నిప్పు–నిప్పు కావాలి’
అగార్కర్ సెలక్టర్‌గా వచ్చిన దగ్గరినుంచి గిల్‌ను అసాధారణ ఆటగాడిగా చెబుతూ అండగా నిలుస్తూ వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్‌ను కాదని గిల్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగించడంతో పాటు త్వరలోనే మూడు ఫార్మాట్‌లలో కూడా కెప్టెన్ అంటూ ప్రచారం చేశారు. ఐపీఎల్‌లో అతని నిలకడైన ప్రదర్శన కూడా టి20ల్లోనూ నమ్మకం కలిగించింది. ఇదే క్రమంలో దాదాపు ఏడాది తర్వాతి జట్టులోకి వచ్చినా నేరుగా అతనికి ఆసియా కప్ వైస్ కెప్టెన్సీ అప్పగించారు.
అయితే బ్యాటింగ్ పరంగా ఓపెనింగ్‌లో గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయా డు. ఒక వైపు అభిషేక్ శర్మ చెలరేగుతుండగా, మరో వైపు గిల్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. దీనికి ఆరంభంలో ‘నిప్పు–నీరు’ అంటూ కాంబినేషన్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేసినా...ప్రస్తుతం టి20ల్లో ఓపెనింగ్ అంటే ‘నిప్పు–నిప్పు’గానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
గిల్‌కు ఓపెనింగ్ ఇవ్వడంతో మూడు అంతర్జాతీయ టి20 సెంచరీల తర్వాత కూడా సంజు సామ్సన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అతడిని అలవాటు లేని మిడిలార్డర్‌కు తీసుకురావడంతో సామ్సన్ కూడా ఆశించిన విధంగా ఆడకపోవడంతో గిల్‌పై విమర్శలు మొదలయ్యాయి. అయినా సరే టీమ్ మేనేజ్‌మెంట్ సమర్థిస్తూ వచ్చింది. స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉండటమే కాదు అసలు పరుగులు రావడమే గగనంగా మారిపోయింది.
గత 18 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం పరిస్థితిని చూపిస్తోంది. శుక్రవారం దక్షిణాఫ్రికాపై గిల్ స్థానంలో వచ్చిన సామ్సన్ దూకుడుగా ఆడి తన విలువను మళ్లీ చూపించాడు. మరో వైపు సూర్యకుమార్ కూడా ఘోరంగా విఫలమవుతున్నా...కీలక టోర్నీకి ముందు ఇద్దరినీ ఒకే సారి తప్పించలేని పరిస్థితి వచ్చింది.
పైగా ఇప్పుడు ఫామ్‌లో లేకపోయినా...అంతకు ముందే టి20ల్లో తన స్థాయిని సూర్యకుమార్ నిరూపించుకున్నాడు కాబట్టి అతనిపై ఎంతో కొంత నమ్మకం మిగిలి ఉంది. దాంతో గిల్‌పై వేటు పడింది. టీమ్ కాంబినేషన్ కారణంగానే 2024 టి20 వరల్డ్ కప్‌లో కూడా గిల్‌కు చోటు దక్కలేదు.
భారత జట్టు వివరాలు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా.


