టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు.. బుధవారం రాత్రి వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ని మట్టికరిపించింది. 76 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రూథర్‌ఫర్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూథర్‌ఫర్డ్ 76 పరుగులు చేయగా.. ఛేజ్ 34, హోల్టర్ 33 తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్, రషీద్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభమే దక్కినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్ 43 పరుగులతో కాస్త పోరాడినప్పటికీ ఇతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఫలితంగా ఈ టోర్నీలో విండీస్ రెండో విజయం నమోదు చేసింది.


