భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా సుదీర్ఘ కాలంగా ‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్’తో కొనసాగిన అనుబంధాన్ని ముగించాడు. 2016 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కంపెనీ నీరజ్ చోప్రా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూస్తూ వచి్చంది. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఆరంభంలో జత కట్టిన అథ్లెట్లలో నీరజ్ ఒకడు. ఈ సంస్థతో విడిపోతూ నీరజ్ తన సొంత అథ్లెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘వెల్ స్పోర్ట్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
అటు నీరజ్, ఇటు జేఎస్‌డబ్ల్యూ కూడా ఎలాంటి వివాదం లేకుండా పరస్పర ఒప్పందంతోనే ఈ బంధానికి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాయి. ‘గత పదేళ్లుగా నా అద్భుత ప్రయాణం, ఎదుగుదలలో జేఎస్‌డబ్ల్యూ కీలక పాత్ర పోషించింది. వారు అందించిన సహకారానికి ఎప్పటికీ కృతజు్ఞడను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నీరజ్‌తో కలిసి పని చేయడం గొప్ప గౌరవం. ఆటకు సరైన సహకారం అందిస్తే అద్భుతాలు జరుగుతాయనే మా నమ్మకానికి అతడి విజయాలు సరైన ఉదాహరణ’ అని జేఎస్‌డబ్ల్యూ సీఈఓ దివ్యాంశు సింగ్ అన్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా...2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.


