న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా... దిగ్గజ కోచ్ జాన్ జెలెన్‌జీ (చెక్ రిపబ్లిక్) నుంచి వేరయ్యాడు. ఏడాది కాలంగా జెలెన్‌జీ వద్ద శిక్షణ పొందిన నీరజ్ సానుకూల వాతావరణంలోనే దారులు మార్చుకున్నట్లు శనివారం వెల్లడించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు సాధించిన ఈ చెక్ రిపబ్లిక్ అథ్లెట్... కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారాడు. అతడి శిక్షణలో మరింత రాటుదేలిన నీరజ్ చోప్రా గతేడాది కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు.
చిన్నప్పటి నుంచి ఆరాధించిన జెలెన్‌జీ వద్ద శిక్షణ పొందడం ఎంతో గొప్ప విషయమని నీరజ్ పేర్కొన్నాడు. ‘జెలెన్‌జీ వద్ద శిక్షణతో ఎన్నో విషయాల్లో నా ఆలోచన సరళి మారింది. టెక్నిక్, రిథమ్ వంటి వాటిలో అతడి ప్రోత్సాహం మరవలేనిది. ఒక్క సీజన్‌లోనే జెలెన్‌జీ నుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితం మొత్తం ఆరాధించిన వ్యక్తి ఒక స్నేహితుడిగా మారి మార్గనిర్దేశం చేయడం ఎప్పటికీ మరవలేను. అతడు కేవలం అత్యుత్తమ జావెలిన్ త్రోయర్ మాత్రమే కాదు.
అంతకుమించి మంచి మనిషి అని నీరజ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నట్లు నీరజ్ వెల్లడించాడు. మరోవైపు దీనిపై జెలెన్‌జీ స్పందిస్తూ... ‘నీరజ్ వంటి అథ్లెట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. అతడిని కలవడం సంతోషంగా ఉంది. నా శిక్షణ కాలంలో అతడు 90 మీటర్ల మార్క్ దాటడం సంతృప్తినిచి్చంది. భవిష్యత్తులోనూ అతడితో బంధం కొనసాగుతుంది’ అని 59 ఏళ్ల జెలెన్‌జీ పేర్కొన్నాడు.


