ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తమ బైక్‌ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
భారత్‌లో తయారు చేసే జీ 310 ఆర్‌ఆర్, సీఈ 02 బైక్‌లతో పాటు ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్‌ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్‌లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.


