అరబ్ దేశమైన ఒమన్ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేతన విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ జాయెద్ అల్ బైవిన్ తెలిపారు. త్వరలోనే కార్మికులకు వేతనాలు పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కార్మిక మార్కెట్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వాటాదారులతో సంప్రదించి మంత్రిత్వ శాఖ సిఫార్సులను రూపొందించిందని... మెరుగైన జీవన ప్రమాణాలు సాధించే విధంగా కనీస వేతనాన్ని పెంచే విషయంపై మంత్రిత్వ శాఖ పరిశీలించిందని తెలిపారు.
కనీస వేతన పెంపు విధానంపై మంత్రిత్వ శాఖ అధ్యయనం పూర్తయిందని.. సిఫార్సులను సంబంధిత అధికారులకు సమర్పించినట్లు అల్ బైవిన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియకు ఆమోదం లభించనుందని పేర్కొన్నారు. షురా కౌన్సిల్ ఐదు ప్రధాన రంగాలపై దృష్టి సారించి చర్చలు జరిపిందని వెల్లడించారు. కార్మిక మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి.. ఉద్యోగాలను సృష్టించడానికి, డిమాండ్‌కు అనుగుణంగా కార్మికులను అందించడానికి రూపొందించిన కార్యక్రమాలను కౌన్సిల్ సమావేశంలో మంత్రి మహద్ అల్ బైవిన్ ప్రదర్శించారు.
విదేశీయులను నియమించడం లాంటి విస్తృతమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, బహుళ రంగాలలో జాతీయ శ్రామిక శక్తిని స్థిరీకరించడంలో సహాయపడ్డాయని అన్నారు. ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తుందని అన్నారు. ఈ రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో కలిసి జాతీయ కార్మిక డేటాబేస్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగ నియామక కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని 50 మిలియన్ రియాల్స్ నుంచి 100 మిలియన్ రియాల్స్‌కు పెంచిందని తెలిపారు.
సబ్సిడీ రెండేళ్లపాటు నెలకు 200 రియాల్స్‌తో ప్రారంభమవుతుందని.. మిగిలిన వేతనాలను యజమానులు భరిస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మద్దతు లభించేంత వరకు ఉద్యోగ ఒప్పందం ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. 2021 నుంచి గత సంవత్సరం అక్టోబర్ వరకు 200,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయని మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ రంగంలో 68,033 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 81,114 ఉద్యోగాలు, రెండు రంగాలలో 50,925 శిక్షణ సంబంధిత ఉద్యోగాలు ఉన్నాయన్నారు.


