తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరల పెంపు అంశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది.
ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలపై ఈనెల 9న వాదనలు జరగ్గా.. అంతకుముందే అంటే 8వ తేదీ అర్ధరాత్రి ది రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు, ప్రీమియర్లకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. కానీ ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది.


