ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు | SBI hikes ATM transaction charges | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు

Jan 13 2026 5:42 AM | Updated on Jan 13 2026 5:45 AM

SBI hikes ATM transaction charges

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్‌బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్‌చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ప్రభావం వీరిపైనే..
ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్‌బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్‌బీఐ ఇచ్చింది.

ఉచిత లావాదేవీల పరిమితులు
రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.

ప్రభావం లేని ఖాతాలివే.. 
ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్‌బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement